ఏపీలో మరోసారి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో.. ఆ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేతం ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ జరగబోతోంది.
అయితే ఖాళీ అయిన ఆ మూడు స్థానాల్లో నియామకంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్జన భర్జన పడుతున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలకు మూడు స్థానాలు పంచుకుంటాయని భావించారు. కానీ ఆ తర్వాత టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి దక్కనున్నాయని బలంగా ప్రచారం జరుగుతుంది. జనసేన నుంచి నాగబాబుకు రాజ్యసభ సీటు ఆల్మోస్ట్ ఖాయమని అంతా అనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ స్థానం బీజేపీ ఆశించడంతో నాగబాబు వెనక్కి తగ్గారు. దీంతో ఈసారి నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు.
కానీ ఆయన ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మారిన సమీకరణలతో సానా సతీశ్ పేరు తెరపైకి వచ్చింది. జనసేనకు దక్కే రాజ్యసభ్య సీటుకు నాగబాబు, సానా సతీశ్ పోటీ పడుతున్నారు. టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఇక మిగతా రెండు స్థానాల్లో బీదా మస్తాన రావుకే తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కారణం లేకపోలేదు.. రాజ్యసభ రెన్యువల్ చేస్తానంటేనే మస్తాన్ రావు వైసీపీ ఎంపీగా రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పైగా ఖాళీ అయిన మూడు స్థానాలు బీసీలకు చెందినవే. కాబట్టి ఈ సీటు అయినా బీసీలకు ఇవ్వకపోతే చాలా విమర్శలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే బీద మస్తాన్ రావుకు సీటు ఖరారు చేశారు.
ఇక మిగిలిన ఒక్క స్థానం టీడీపీ నుంచి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ వైపు మెగ్గు చూపుతున్నారు. అయితే మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అదే స్థానాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు ఒక రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీ వెనక్కి తగ్గితే టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్ లో ఒకరికి రాస్యసభ్య సీటు దక్కడం ఖాయమని అంటున్నారు.