హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొద్దిరోజుల క్రితం వెలువడిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడిగా జరిగాయి. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగా జమ్ము కాశ్మీర్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహా రాష్ట్రతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
నవంబర్ 26 తో మహారాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి, 2025 జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీ కాల పరిమితం ముగియనుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక, మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది, ఝార్ఖండ్ లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.
హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఆల్రెడీ గత ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారడం, ఎన్సీపీలో చీలిక, శివసేనలో చీలిక వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సారి మహారాష్ట్ర ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక, గత లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి కాస్త వ్యతిరేక పవనాలు వీచిన నేపథ్యంలో ప్రధాని మోడీకి మహారాష్ట్ర ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. దీంతో, మోడీకి మోగిన ‘మహా’ ఎన్నికల నగారాపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్
అక్టోబర్ 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 04 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 20న పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు
ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్
అక్టోబర్ 18న మొదటి దశ, అక్టోబర్ 22న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 25 వరకు మొదటి దశ, అక్టోబర్ 29 వరకు రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 30 వరకు మొదటి దశ, నవంబర్ 1 వరకు రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు