తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. `అధికారం కోల్పోయాక..` అంటూ ఆయన పరోక్షంగా రేవంత్‌రెడ్డి సర్కారును హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కక్షసాధిం పు రాజకీయాలు చేయడం ఎవరికీ సమంజసం కాదన్నారు. ఇలా చేస్తే.. ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని వ్యాఖ్యానిం చారు. “అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు మజాగా ఉంటాయి. కానీ, అధికారం కోల్పోయాక.. మాత్రం ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. అలా చేయద్దు.. అలా చేసి అనేక మంది ప్రభుత్వాలు కోల్పోయారు“ అని పరోక్షంగా సొంత ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనేనని చెప్పిన జగ్గారెడ్డి.. కక్ష సాధింపు రాజకీయాలకు మాత్రం తావు ఉండరా దన్నారు. అలాంటి రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. “కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకి లేదా ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. అలాంటి రాజకీయాలు చేసేవాళ్లు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుంది` అని జగ్గారెడ్డి తనదైన శైలిలో హెచ్చరించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల తీరును కూడా ఆయన వివరించారు. గతంలో వైఎస్ , రోశయ్య వంటివారు.. సానుకూల రాజకీయాలకు.. ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
తన వ్యక్తిగత రాజకీయాలను ప్రస్తావిస్తూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరికీ ఎలాంటి నష్టం చేసేలా నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులపై యుద్ధం చేయడం సహజమేనని.. కానీ, అసలు ప్రత్యర్థులే లేకుండా చేస్తామనే కక్ష పూరిత రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. అన్ని పార్టీలు, అందరు నాయకులు కూడా డబ్బులు తీసుకునే రాజకీయాలు చేస్తున్నాయని మరో సంచలన వ్యాఖ్య చేశారు. అలా కాదంటే.. డబ్బులు తీసుకోని పార్టీ, తీసుకోని నాయకుడు ఎవరైనా ముందుకు రావాలని సూచించారు. తాను కూడా డబ్బులు తీసుకునే పనులు చేయించానని బాంబు పేల్చారు.
ఎందుకీ వ్యాఖ్యలు..
కారణం లేకుండా జగ్గారెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సర్కారు కేసులు పెట్టడం.. విచారణకు పిలవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇది పైకి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో కేటీఆర్ అనుకూల వర్గం.. ఈ కేసులను కక్షపూరిత రాజకీయాలు పేర్కొంటూ చాపకింద నీరులా ప్రచారం చేస్తోంది. దీనిపై స్థానికంగా చర్చ కూడా సాగుతోంది. ఈ విషయాల నేపథ్యంలోనే జగ్గారెడ్డి నర్మగర్భంగా కక్షపూరిత రాజకీయాలపై తనదైన శైలిలో సొంత ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారని తెలుస్తోంది.