తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. తిరువూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా ఆయన లెక్క చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఇక, కొలికపూడి దురుసు ప్రవర్తన కారణంగా ఇబ్బందిపడుతున్నామని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్లు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే కొలికలపూడిని టీడీపీ అధిష్టానం పలుమార్లు హెచ్చరించింది కూడా. అయినా సరే, కొలికపూడి తీరు మారకపోవడంతో తాజాగా ఆయనపై టీడీపీ క్రమ శిక్షణ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ రోజు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలతో క్రమశిక్షణ కమిటీముందుకు కొలికపూడి విచారణకు వచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిక కొలికపూడి కీలక వ్యాఖ్యలు చేశారు.
గోపాలపురం ఘటనపై కమిటీకి వివరణనిచ్చానని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు గోపాలపురం వెళ్లానని, ఆ సమయంలో రోడ్డుపై వైసీపీకి చెందిన ఓ కుటుంబం ముళ్ల కంచె వేయడంతో దానిని తొలగించానని చెప్పారు. దీంతో, తనను టార్గెట్ చేశారని, ఆత్మహత్యాయత్నం అంటూ వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేసింది కూడా ఆ కుటుంబమేనని, గ్రామస్తులకు అన్ని వాస్తవాలు తెలుసని చెప్పారు.