దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్ క్షణం తీరిక లేకుండా వరుస భేటీలలో తలమునకలై ఉన్నారు. రెండో రోజు పర్యటన సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ అయ్యారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో సమావేశమైన లోకేశ్…ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. భారత్ లో ‘పాస్ కీ’ చెల్లింపుల సేవలు ప్రారంభిస్తామని రాజమన్నార్ తెలిపారు.
స్వనీతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణ-వాతావరణ ఉద్యమం భవిష్యత్తు’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో పోర్చుగల్ మాజీ ప్రధానితో పాటు జోర్డాన్ రాణి, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్, తదితరులు హాజరయ్యారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఏకైక పరిష్కారం అని లోకేశ్ అన్నారు. సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించామని తెలిపారు.
పునరుత్పాదక శక్తి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలు గుర్తించామని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐఆర్ఈఎస్పీ ప్రాజెక్టును ఏపీ కలిగి ఉందని అన్నారు. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధిస్తామని తెలిపారు. ఏఐతో పాటు డీప్ టెక్ లో కూడా ఏపీ ముందుందని చెప్పారు.