ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళాలో తళుక్కున మెరిసిన మోనాలిసా భోంస్లే అనే టీనేజ్ అమ్మాయి గత కొద్ది రోజుల నుంచి ఇంటర్నెట్ లో ఎంతలా సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా కుటుంబం చాలా ఏళ్లుగా పూసలదండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసల దండలు అమ్ముతూ కుటుంబానికి అండగా ఉంటుంది. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు మోనాలిసా పూసలదండలు అమ్మడానికి రాగా.. ఆమె అమాయకు చూపులు, స్వచ్ఛమైన చిరునవ్వు, నీలి కళ్లకు పర్యాటకులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిగా.. ఒక్కసారిగా మోనాలిసా టాక్ ఆఫ్‌ది కంట్రీగా మారిపోయింది.
మోనాలిసా తన అందంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. మహా కుంభమేళాలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ అంతా మైక్‌లు, కెమెరాలు పట్టుకుని ఆమె వెనుకే పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మోనాలిసాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కుంభమేళా పుణ్యమా అని ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన మోనాలిసాకు ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆర్సీ 16`. గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు సతీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. `పెద్ది` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కోసం మోనాలిసాను తీసుకునే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నారని.. త్వరలోనే ఆమెతో సంప్రదింపులు కూడా జరపబోతున్నారని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే మోనాలిసా దశ తిరిగినట్లే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.