టాలీవుడ్ లో పలువురు ప్రముఖ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు మొదలు మైత్రీ మూవీస్ అధినేతలలో ఒకరైన నవీన్ వరకు అందరి ఇళ్లు, ఆఫీసులలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా విలక్షణ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుకుమార్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఇంటికి ఐటీ శాఖ అధికారులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
సుకుమార్ కు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీలు, సంబంధిత డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారట. ‘పుష్ప 2’ సినిమా నిర్మాణంలో సుకుమార్ బ్యానర్ కూడా పార్ట్ నర్ గా ఉంది. ఆ చిత్రం 1850 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన క్రమంలోనే ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ ఆఫీస్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ ఇళ్లలో నిన్న అధికారులు సోదాలు నిర్వహించారు.
దాంతోపాటు, దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ అగర్వాల్ ల ఇళ్లు, ఆఫీసులతో పాటు టాలీవుడ్ లోని పలువురు బడా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో పలువురు నిర్మాతలకు సన్నిహితుడైన రిలయన్స్ శ్రీధర్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారట.