దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటన సందర్భంగా ‘ఏపీ పెవిలియన్’ దగ్గర వివిధ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రపంచ దిగ్గజ సంస్థల సీఈవోలు, చైర్మన్లతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే దావోస్ టూర్ లో చంద్రబాబు తొలి సక్సెస్ సాధించారు.
అమరావతిలో టాటా గ్రూప్ సహకారంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటేటివ్ నెస్ కేంద్రం (జీఎల్ సీ) ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హాక్ చియోల్, అంతర్జాతీయ లాజిస్టిక్స్ కంపెనీ మేస్క్ సీఈవో విన్సెంట్ క్లెర్క్, టెక్ కంపెనీ సిస్కో సీఈవో/చైర్మన్ చక్ రాబిన్స్ తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు పెట్టుబుడులపై చర్చించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని వివరించారు.1000 కిలోమీటర్ల తీరప్రాంతం, విస్తారంగా పోర్టులు ఉన్నాయని డెన్మార్క్‌కు చెందిన మేస్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌కు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన మేస్క్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది.
ఇథర్‌నెట్, ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ వంటి నెట్‌వర్కింగ్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ ను కోరారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.