ఏడాది మొదట్లో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరస్ సదస్సు జరగటం తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం క్రమం తప్పకుండా హాజరు కావటం కనిపిస్తుంది. తెలంగాణలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. దావోస్ వెళ్లనప్పటికి.. ఆయన కుమారుడు కం అప్పట్లో రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ తన టీంతో దావోస్ కు హాజరయ్యేవారు.
ఈ క్రమం తప్పకుండా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు..రేవంత్ లు వెళ్లటం తెలిసిందే.
తాజాగా వీరిద్దరు స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టులో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భేటీ కాని ఈ సీఎంలు.. దేశం కాని దేశంలో కలవటం.. కూర్చొని మాట్లాడుకోవటంతో.. వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఎయిర్ పోర్టుకు రైజింగ్ తెలంగాణ టీంకు.. చంద్రబాబు టీంకు ఏపీ వాసులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీలో రెండు రాష్ట్రాల్లోని డెవలప్ మెంట్ యాక్టివిటీస్ తో పాటు.. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లుగా చెబుతున్నా.. ఆ వ్యాఖ్యల్లో అర్థం లేదంటున్నారు.
ఎందుకంటే.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ కు వెళ్లినప్పుడు.. ఆ అంశాల మీద ఇద్దరు ముఖ్యమంత్రులుకూర్చొని మాట్లాడుకుంటారన్న దానిలో లాజిక్ లేదన్న వాదన వినిపిస్తోంది. వీరి భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి లోకేశ్.. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులుపాల్గొన్నారు. మొత్తంగా ఈ భేటీ సామరస్య వాతావరణంలో సాగినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు జాతి అంతర్జాతీయంగా వెలుగొందాలన్నఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు.
తమ భేటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు జ్యూరిక్ విమానాశ్రయంలోని వెయిటింగ్ లాంజ్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును యాద్రశ్చికంగా కలిశా. మా సమావేశంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించుకున్నాం. స్వల్ప సమయమే మాట్లాడుకున్నా.. చర్చ గౌరవప్రదంగా జరిగింది’ అంటూ తామిద్దరం మాట్లాడుకున్న ఫోటోను తన పోస్టుకు జత చేశారు. దీనికి రీట్వీట్ చేసిన చంద్రబాబు.. ‘రెండు రాష్ట్రాలు.. ఒకటే స్ఫూర్తి’ అంటూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం ఆనందంగా ఉంది’ అంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.