అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయటం.. నిమిషాల వ్యవధిలో గతంలో తాను చెప్పిన మాటల్ని వాస్తవ రూపంలో దాల్చటం.. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేసిన ట్రంప్ తీరుతో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. మంగళవారం ట్రేడింగ్ లో ఏకంగా రూ.7.52 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగి వచ్చింది.
సెన్సెక్స్ లోని మొత్తం 30 షేర్లలో 0.39శాతం లాభంతో అల్ట్రాటెక్.. 0.33 శాతంతో హెచ్ సీఎల్ లు మాత్రమే గట్టెక్కగా.. మిగిలిన అన్ని షేర్లు నష్టాల బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మేయటం షేర్ మార్కెట్ సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బ తీసింది. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్ ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన బారత ఈక్విటీలు అమ్మేశారు.
ఓవైపు ట్రంప్ భయం.. మరోవైపు దేశీయ కార్పొరేట్ ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికర లాభ వ్రద్ది కేవలం నాలుగు శాతం మాత్రమే. అధిక వెయిటేజ్ ఉన్న షేర్లు జొమాటో 11 శాతం.. ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం.. ఎస్ బీఐ 2.57శాతం.. రిలయన్స్ 2.5 శాతం.. ఎంఅండ్ ఎం 2.25 శాతం షేర్లు భారీగా క్షీణించటం కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీసింది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినంతనే మెక్సికో.. కెనడాలపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 25 శాతం వాణిజ్య సుంకాల విధింపునకు రెఢీ కావటంతో.. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతూ అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్ భారీగా దెబ్బ పడుతోంది.