బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే ఓ దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. సైఫ్ ఇంట్లో చోరీ యత్నించే క్రమంలో దాడి జరిగింది. ఈ దాడితో సైఫ్ దుండగుడి చేతుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సైఫ్ పై కత్తితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే సైఫ్ ప్రాణాలను కాపాడటంతో ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా కూడా కీలక పాత్రను పోషించాడు.
దాడి జరిగిన సమయంలో డ్రైవర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సైఫ్ ను అతని ఇద్దరి కుమారులు తైమూర్, జేహ్ ఓ ఆటోలో ఆస్పత్రికి తరలించారు. రక్తసిక్తమైన సైఫ్ ను సదరు ఆటోవాలా షార్ట్ కట్స్ వెతుక్కుంటూ సేఫ్ గా లీలావతి ఆస్పత్రికి చేర్చాడు. సకాలంలో నటుడికి చికిత్స అందేలా చేశాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాతే ఆటోలో ఉన్నది నటుడు సైఫ్ అన్న విషయం తెలుసుకున్న భజన్ సింగ్ రానా.. బదులుగా వారి దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. దీంతో అతని గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఒక ప్రాణాన్ని నిలబెట్టడంలో తనవంతు కృషి చేసిన భజన్ సింగ్ రానాకు తాజాగా ఓ సంస్థ రికార్డు ప్రకటించింది. అతనికి శాలువా కప్పి, రూ.11 వేల నగదు బహుమతి అందించి సత్కరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఉత్తరాఖండ్ నివాసి అయిన భజన్ సింగ్ రానా గత కొన్నేళ్ల నుంచి ముంబైలో ఆటో నడుపుకుంటున్నాడు. సైఫ్ ఘటనతో అతను ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఇక సైఫ్ దాడి కేసులో భజన్ సింగ్ రానా సైతం పోలీసుల విచారణలో పాల్గొని ఆ రోజు అర్థరాత్రి జరిగిన అన్ని విషయాలు వివరించాడు.