కొత్త సినిమాలకు రిలీజ్ కంటే ఒకటి రెండు రోజులు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది. సామజవరగమన, బేబి లాంటి సినిమాలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాయి. ప్రిమియర్స్ ద్వారా వాటికి మంచి టాక్ వచ్చి సినిమాలు అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించాయి. ఐతే రంగబలి, హిడింబ లాంటి కొన్ని సినిమాలకు మాత్రం నెగెటివ్ టాక్ రావడం మైనస్ అయింది కూడా. అంటే ప్రిమియర్స్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి అన్నమాట.
ఇది మేలు చేయొచ్చు. చేటు చేయొచ్చు. ఈ నేపథ్యంలో పెదకాపు సినిమా టీం డేరింగ్ డెసిషన్ తీసుకుంది.
ఈ సినిమాకు రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. పెదకాపు ఈ నెల 29న రిలీజవుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక షోకు బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. త్వరలోనే మరిన్ని షోలు యాడ్ చేయబోతున్నారు. 28న స్కంద, చంద్రముఖి-2 మంచి అంచనాలతో రిలీజవుతున్నాయి.
ఆ రోజు ఫోకస్ అంతా ఆ చిత్రాల మీదే ఉంటుంది. అయినా సరే పెదకాపు ప్రిమియర్స్ వేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. విరాట్అనే కొత్త హీరో నటించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల రూపొందించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో అతను ఓ కీలక పాత్ర కూడా చేశాడు. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మంచి బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రావు రమేష్, తనికెళ్ల భరణి, ఆడుగళం నరేన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.