వైసీపీ నాయకులు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌లకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న జోగి, దేవినేని.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు దాఖలు చేసిన పిటిషన్లపై నేడుజస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌లకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల పాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దర్యాప్తు అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌లకు సూచించింది. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
అంతేకాకుండా ఇరువురు నేతలు 48 గంటల్లో తమ పాస్‌పోర్టును దర్యాప్తు అధికారులకు సరెండర్ చేయాలని అత్యున్యత న్యాయస్థానం పేర్కొంది. ఇక సాంకేతిక కారణాల వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోయిన సుప్రీంకోర్టు.. నవంబర్ 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు జోగి, దేవినేని ముందస్తు బెయిల్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.