టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే నడిచిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తాజాగా తన ఫ్యూచర్ ప్లాన్ ను రివీల్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్గా.. అధికారంలో లేనప్పుడు పీఏసీ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగిన యనమల ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
అయితే ఫ్యూచర్ ప్లాన్ పై శాసనమండలి లాబీలో యనమల మీడియాతో మాట్లాడారు. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని ఈ సందర్భంగా యనమల తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. ఒకవేళ ఆ అవకాశం రాకుంటే విశ్రాంతి తీసుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ప్రకటన నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి ఫలానా వాళ్లకి ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్తే వెంటనే స్వాగతించానని యనమల చెప్పుకొచ్చారు.
మండలిలో రెండుసార్లు తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ హైకమాండ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మరో అవకాశంపై ఆసక్తి లేదని అధినేతకు స్పష్టం చేశానన్నారు. మండలి అవకాశం కన్నా ముందే రాజ్యసభకు వెళ్లాలనుకున్నానని.. కానీ అది సాధ్యపడలేదని యనమల రామకృష్ణుడు మీడియాతో తెలియజేశారు. అలాగే 1982లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే ఉన్నానని.. నాటితో పోలిస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని యనమల వ్యాఖ్యానించారు. డబ్బున్న వారికే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం యనమల కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి రాజ్యసభకు వెళ్లాలన్న యనమల కోరికను చంద్రబాబు తీరుస్తారా? లేదా? అన్నది చూడాలి.