అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ ‘కోమటి జయరాం’ అన్నారు.
బుధవారం ఆయన ఒంగోలు అన్నవరప్పాడులోని శివం శరణాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయనకు శరణాలయం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న అనాధలకు ‘కోమటి జయరాం’ పండ్లు, వస్త్రాలు పంపిణీ చేసి అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపే అన్నదాన కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తానా, ఎన్ఆర్ఐల తరపున వీలయినంత సహకారాన్ని అందజేస్తామని అన్నారు.
ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మారెళ్ల వివేకానంద మాట్లాడుతూ కోవిడ్, తుఫాను సమయంలో సైతం శివం ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి రోజు నిర్వహించారని ఇది ఎంతో అభినందనీయమని అన్నారు.
అనంతరం నిరుపేదలైన వెంకటేశ్వర్లు, చిట్టెమ్మల కంటి ఆపరేషన్ కోసం రు.20 వేలు అందజేశారు.
ఈ సందర్భంగా ‘కోమటి జయరాం’ను శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటి అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మాదాల కోటేశ్వర రావు, అనిత దంపతులు, వద్దినేని రామాంజనేయులు, మండవ రమ తదితరులు పాల్గొన్నారు.