జనసేన ఆవిర్భావ సభ శనివారం జరగనుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహిస్తుండడంతో ఈ అంచనాలు మరింత ఎక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారు.
ఇదిలావుంటే.. పార్టీకి దశ-దిశ ఏర్పాటులో ఈ సభ ప్రాధాన్యం ఇస్తుందని.. ఈ సభా వేదికగా పవన్ కల్యాణ్ కీలకమైన సూచనలు చేయనున్నారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. నాయకులు ఉన్నా.. బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరు. పైగా.. మరో ఏడాది లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలపై జనసేన జెండా స్పష్టంగా కనిపించాలన్న సంకల్పం ఉన్నా.. ఆదిశగా ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన దాఖలా అయితే లేదు.
నియోజకవర్గాల వారిగా చూసుకున్నా.. 175 స్థానాల్లోనూ.. ఇంచార్జ్లు లేకపోవడం గమనార్హం. వీరిని నియ మించాల్సి ఉంది. అదేసమయంలో పంచాయతీ, మండలాల వారీగా కూడా.. నాయకుల నియామకాలు చేపట్టాలి. బూత్ స్థాయి కార్యకర్తలను నియమించాలి. ఇలా.. అనేక రూపాల్లో పార్టీని ముందుకు నడిపిం చేందుకు ఈ ఆవిర్భావ సభా వేదికగా.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే.. కూటమితో పొత్తు.. పరిణామాలను మరింత బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది.
గత ఏడాది చేపట్టిన సభ్యత్వ నమోదు బాగానే ఉన్నా.. ఆమేరకు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు అయితే ముందుకు సాగడం లేదు. ఇది పార్టీకి ఇబ్బందిగానే మారింది. దీనిపైనా తాజా సభలో దృష్టి పెట్టే అవకా శం ఉంది. రిజర్వేషన్లు, ఎస్సీలు, ఎస్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా కూడా ఈ సభ ప్రత్యేక తీర్మానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా… ఆవిర్భావ సభ పార్టీకి కీలక దశ-దిశ చూపిస్తుందన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.