ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. వరుసగా బెయిల్స్ రావడంతో బుధవారం పోసాని విడుదల కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా జైలు నుంచి పోసాని విడుదలకు బ్రేక్ పడింది. సీఐడీ పోలీసులు పోసానిపై పీటీ వారెంట్ వేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా జైలు వద్దకు చేరుకున్న గుంటూరు సీఐడీ పోలీసులు.. పీటీ వారెంట్‌పై పోసానిని జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరు పరచబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే బెయిల్ వచ్చినా పోసానికి జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, వైసీపీ హయాంలో జగన్ అండంతో ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలపై పోసాని ఎంతలా రెచ్చిపోయారో చెప్పక్కర్లేదు. అయితే సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కేసులు నమోదు కావడంతో..ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లతో పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్‌జైలుకు దారిపట్టారు.
అయితే పోసానిపై నమోదై కేసుల్లో తాజాగా ఆయనకు బెయిల్ లభించింది. మంగళవారం ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, సోమవారం నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. నేడు పోసాని విడుదల అవుతారని అనుకున్నారు. కానీ, సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేడంతో ఆయన రిలీజ్ ఆగిపోయింది.