కేసు ఏదైనా న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట తమ వాదనల్ని వినిపించాలి. తమకు వ్యతిరేకంగా వాదనలు వినిపించే న్యాయవాది వాదనల్లో ఉన్న లోపాల్ని.. తప్పుల్ని ఎత్తి చూపించి.. తమ వాదనలోని బలాన్ని అర్థమయ్యేలా చేయాలి. అందుకు భిన్నంగా భావోద్వేగంగా వ్యవహరిస్తూ.. బ్లాక్ మొయిల్ తరహాలో బెయిల్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించటంలో అర్థం లేదు. తాజాగా అలాంటి తప్పే చేశారు ప్రముఖ సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి.
చంద్రబాబు నాయుడు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. విలేకరుల సమావేశంలో ఎంతలా చెలరేగిపోయింది తెలిసిందే. ఈ అంశాలపై ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు చేయటం.. మొదట కడప జిల్లా పోలీసులు ఆయన్ను అరెస్టు చేయటంతో మొదలైన ఈ అరెస్టుల పర్వంతో ఆయన జైలుకు పరిమితం కావాల్సి వస్తోంది.
ఇదిలాఉండగా.. తాజాగా ఏపీ సీఐడీ పోలీసులు పోసానికి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జడ్జి ఎదుట తనకు రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకోక తప్పదని పేర్కొన్న వైనం షాకింగ్ గా మారింది. ఇరు న్యాయవాదుల వాదనలు అనంతరం పోసాని నేరుగా న్యాయమూర్తితో మాట్లాడుతూ భోరున విలపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఇన్ని కేసులు పెడతారని తనకు తెలీదన్నారు.
తనకు 70 ఏళ్ల వయసు అని.. విలేకరులతో మాట్లాడితేనే ఇన్ని కేసులు పెడతారని తనకు తెలీదన్న ఆయన.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్యాయంగా వాదనలు వినిపించినట్లుగా ఆరోపించారు. తమ ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలన్న పోసాని.. ‘ఇప్పటికే గుండెలో రెండుసార్లు స్టంట్లు వేశారు. గొంతుకు కూడా చికిత్స చేస్తున్నారు. నంది అవార్డుల విషయంలో నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. పార్టీ మారలేదన్న కక్షతో లోకేశ్ నా పై ఈ కేసులు బనాయిస్తున్నారు’’ అంటూ విలపిస్తూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
తాను తప్పు చేసినట్లుగా నిర్ధారిస్తే తనను నరికేయాలని ఉద్వేగంగా మాట్లాడారు. పోసాని బెయిల్ పిటిషన్ మీద వాదనల్ని న్యాయమూర్తి ఇంటి నుంచి నిర్వహించారు. పోసాని ఆన్ లైన్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగావైసీపీ లీగల్ సెల్ కు చెందిన పలువురు లాయర్లు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జడ్జి ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి జడ్జి ముందు ఎప్పుడూ కూడా ఎమోషనల్ బ్లాక్ మొయిల్ తరహాలో వ్యాఖ్యలు చేయకూడదని.. అలా చేసిన సందర్భాల్లో అప్పటివరకు సానుకూలంగా ఉండే పరిస్థితులు ప్రతికూలంగా మారతయాని చెబుతున్నారు.