అన్ని కేసుల్లో వరుస బెయిల్స్ తెచ్చుకుని బుధవారం విడుదల అయ్యేందుకు సిద్ధం అయిన ప్రముఖ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణ మురళికి అఖరి నిమిషంలో బిగ్ షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు సీఐడీ పోలీసులు పోసానిపై పీటీ వారెంట్ వేయడంతో.. ఆయన విడుదలకు బ్రేక్ పడింది.
కర్నూలు జైలు నుంచి పోసానిని నేరుగా జీజీహెచ్‍కు తీసుకెళ్లిన సీఐడీ పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం గుంటూరులోని జడ్జి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరిచారు. పోసాని తరుఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకటరెడ్డి జడ్జి ఎదుట తమ వాదనలు వినిపించారు. ఆ సమయంలో పోసాని బోరున విలపించారని తెలుస్తోంది. వ్యక్తిగత కక్షలతోనే కేసులు పెట్టి 70 ఏళ్ల వయస్స లో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆరోగ్యం ఏం బాగోలేదని.. గుండెకు స్టంట్లు వేశారని, రెండు ఆపరేషన్లు జరిగాయని చెప్పుకొచ్చారు. తనకు భార్యాబిడ్డలు ఉన్నారని, మరో రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట పోసాకి కృష్ణ మురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి మార్చి 26 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.