తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయింది. వైకాపా హయాంలో శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు కూడా చెబుతుండటంతో.. దేశ, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, భక్తులు, అయోధ్య ఆలయం సహా పలు దేవాలయాల అర్చకులు మండిపడుతున్నారు.
మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే తాజాగా ఈ అంశంపై తమిళనాడులోని ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? దేశంలో లడ్డూ విషయం తప్ప ఇంకేం సమస్యలు లేవా..? అంటూ సీమాన్ మండిపడ్డారు.
కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాలి గానీ.. లడ్డూ, బూందీ అంటూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. అనవసరంగా తిరుమల లడ్డూను వివాదం చేస్తున్నారు.. ఇకనైనా ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామంటూ సీమాన్ హితవు పలికారు. అయితే సీమాన్ వివాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను సీమాన్ దెబ్బ తీశారని.. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్య దేవుడని పొంగులేటి గుర్తు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగితే సీమాన్ ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని.. టీటీడీకి, శ్రీవారి భక్తులకు ఆయన క్షమాపణ చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.