టీడీపీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏపీలో వాలంటీర్లు వద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీరు వ్యవస్థను కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంచుతుందా..? లేక ఎత్తేస్తుందా..? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడంలో, ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే.. మరోవైపు వైసీపీకి వాలంటీర్లంతా సానుభూతిపరులు గా వ్యవహరించారు.
తమ పరిధిలో ఉండే ఇళ్లపై పరోక్షంగా నిఘా ఉంచడం, రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయడమే కాకుండా వైకాపా స్థానిక నేతలు చెప్పిన పని చేయడమే లక్ష్యంగా వాలంటీర్లు వ్యవహరించారు. అలాగే రాష్ట్రంలో 2.65 లక్షల వలంటీర్లు ఉండగా.. ఎన్నికల సమయంలో 1.08 లక్షల మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతు తెలిపారు. వైకాపా నేతలతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ చివరకు ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో వాలంటీర్లు భవితవ్యం గందరగోళంలో పడింది.
ఎన్నికల టైమ్ లో చంద్రబాబు వాలంటీర్ల జీతం నెలకు రూ.5 వేలనుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు వాలంటీరు వ్యవస్థను కొనసాగించే పరిస్థితే కనిపించలేదు. వాలంటీర్లపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేఖత నెలకొంది. ఇటీవల చంద్రబాబు పెన్షన్ పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మరోవైపు వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదంటూ అడ్వకేట్ ఉన్నం శ్రవణ్ కుమార్ వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇక తాజాగా జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ.. తమకు వాలంటీర్లు వద్దు, వారి స్థానంలో పారిశుధ్య కార్మికులే కావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వాలంటీర్లు అవసరం లేదని.. గ్రామాల్లో సచివాలయ సిబ్బందితోనే సర్వీస్ చేయించుకోవచ్చని జ్యోతుల అన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు ఇస్తానన్న రూ.10 వేలు పారిశుధ్య కార్మికులకు ఇస్తే పదిమందికి పని కల్పించినవారవుతామని, గ్రామాలు పారిశుధ్య లోపం నుంచి బయటపడతాయని జ్యోతుల పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని కూడా జ్యోతుల వెల్లడించారు.