వైసీపీ నాయకుడు, గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు లో బోరుగడ్డ బుధవారం ఉదయం పోలీసులకు సరెండర్ అయ్యాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని హైకోర్టుకే టోకరా వేశాడు బోరుగడ్డ. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో మధ్యంతర బెయిలు పొడిగించుకుని బయటకు వెళ్లాడు. అయితే బోరుగడ్డ బెయిల్ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతోనే ముగిసింది. కానీ బోరుగడ్డ మాత్రం సరెండర్ కాలేదు. బెయిల్ పొడిగించాలంటూ మంగళవారం బోరుగడ్డ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించాడు.
తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే బోరుగడ్డ ఉన్నారనిఅతని లాయర్ కోర్టుకు చెప్పుకొచ్చారు. అయితే మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సాయంత్రం 5 గంటల్లోపు చెన్నై నుంచి ఫ్లైట్ లో వచ్చి అయినా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ బోరుగడ్డ అజ్ఞాతం వీడలేదు. ఈ విషయాన్ని జైలు అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం సీరియస్ అయింది.
నిర్దేశించిన గడువు ముగిసినా బోరుగడ్డ జైలులో లొంగిపోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థలను సైతం ధిక్కరించేలా బోరుగడ్డ వ్యవహార శైలి ఉందని హైకోర్టు మండిపడింది. ఇదే తరుణంలో బోరుగడ్డ లొంగిపోతాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. అయితే ఉత్కంఠకు తెర దించుతూ.. బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా కంట పడకుండా గప్‌చుప్ గా బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఆయనపై పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉండటంతో గుంటూరు పోలీసులు బోరుగడ్డను గుంటూరు తరలించారు.
కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి పద్మావతిని చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ తొలిసారి ఫిబ్రవరి 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అదే నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తన తల్లికి సంబంధించి నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మార్చి 11 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించుకున్నాడు. అయితే బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత వీడియో రిలీజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. చేతులారా బెయిల్ వచ్చే అవకాశాలు పోగొట్టుకున్నాడు.