తెలుగు పాలిటిక్స్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి కొడాలి నాని సుపరిచితమే. టీడీపీ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైసీపీలో చేరిన కొడాలి.. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తూ జగన్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను అసభ్యకరమైన బూతులు తిట్టడమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై సైతం నోరు జారి టీడీపీ క్యాడర్ ఆగ్రహానికి గురయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. గుడివాడలో కొడాలి నాని కూడా ఓడిపోయారు. గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎగిరెగిరి పడిన కొడాలి.. మీడియాలో కనిపించడం తగ్గించేశారు. కొన్ని రోజుల నుంచి గుడివాడకు రావడం కూడా మానేశారు. అయినాసరే కొడాలిని వదిలేందుకు టీడీపీ పెద్దలు ఏమాత్రం అంగీకరించడం లేదు. కొడాలికి గట్టిగా బుద్ది చెప్పాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే గుడివాడలో కొడాలి చేసిన అడ్డగోలు దోపిడీని ఆధారాలతో సహా కూటమి సర్కార్ బయటకు లాగుతుంది.
ఎన్నికలు ముగిశాక కొడాలి నాని పై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. మొన్నటికి మొన్న బూతులు తిట్టారంటూ కొడాలి నాని పై ఓ లా-స్టూడెంట్ విశాఖలో కేసు పెట్టింది. ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల పేరుతో కొడాలి చేసి స్కామ్ సైతం వెలుగులోకి వచ్చిందట. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 178 ఎకరాలు సేకరించి.. మళ్లీ వాటికి మెరక వేయాలంటూ తన అనుచరులకే వర్క్ ఆర్డర్స్ ఇచ్చి కొడాలి కోట్ల రూపాయిలు కొల్లగొట్టాడని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.
ఈ విషయంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. కొడాలి అవినీతికి సంబంధించి గోప్యంగా విచారణ జరిపిస్తోంది. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో రూ. 8 కోట్ల రూపాయలతో మెరక పనులు చేపట్టి.. 40 కోట్ల దాకా కొడాలి స్వాహా చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో విలిజెన్స్ అధికారులు ముక్కును వేలేసుకున్నారట. ఇక పక్కా ఆధారాలు సేకరించి త్వరలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనుందని.. ఈ స్కామ్ లో కొడాలి నాని అరెస్ట్ ఖాయమేనని ఇన్సైడ్ బలంగా టాక్ నడుస్తోంది.