దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. వేడుకలు జరగడానికి నెల రోజుల ముందు నుంచే నిఘా వర్గాలు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ గస్తీని ముమ్మరం చేస్తాయి. ఇక, ఈ వేడుకల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిఘాను తీవ్రతరం చేస్తాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ప్రధాని మోదీతోపాటు ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. 75వ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనే వీవీఐపీలకు ముప్పు ఉందని 9 పేజీల నివేదికలో ఐబీ హెచ్చరించింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నివేదికలో పేర్కొంది.
వీవీఐపీలు,కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి అలజడులు రేపేందుకు ఆ గ్రూపులు కుట్ర పన్నుతున్నాయని తెలిపింది. డ్రోన్ల ద్వారా దాడి జరిగే చాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. పాక్ లో తలదాచుకున్న ఖలిస్థానీ గ్రూపులు పంజాబ్‌లో తిరిగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ విధ్వంసానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపింది.
తాజాగా ఐబీ వార్నింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు విధించారు. డ్రోన్లు, పారా గ్లైడర్లు, పారా మోటార్లు, యూఏవీలు(మానవ రహిత వాయు వాహనాలు), తేలికపాటి సూక్ష్మ విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో ఎగిరే వస్తువులు, ఎయిర్ బెలూన్లు, గాలిలో ఎగిరే చిన్నపాటి విద్యుత్ వాహనాలు, పారా జంపింగ్‌లపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 14న ఘాజియాబాద్ ఫ్లైవోవర్ మార్కెట్ వద్ద ఐఈడీ గుర్తించిన నేపథ్యంలో రిపబ్లిక్‌డే పరేడ్ జరిగే రాజ్‌పథ్ రోడ్డు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.