ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో మరోసారి మమతా బెనర్జీకే అధికారం దక్కనుందని పోల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. బెంగాల్లో దీదీ కోటలో పాగావేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది.
అయినప్పటికీ బెంగాల్ ఓటర్లు దీదీవైపే మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్ లో టీఎంసీ 203 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148ని టీఎంసీ అవలీలగా దాటేలా కనిపిస్తోంది. తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది.
మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే 142 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళలో పినరాయి విజయన్ ఆధ్వర్యంలోేని ఎల్డీఎఫ్ కూటమి 94 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు.
తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. దీంతో, బెంగాల్ లో దీదీ మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోనుండగా…తమిళనాడులో స్టాలిన్ సీఎం కాబోతున్నారు.