చాలామంది సీనియర్ హీరోల బాటలోనే తన కొడుకును సైతం హీరోను చేశాడు శ్రీకాంత్. ఆయన తనయుడు రోషన్ టీనేజీలో ఉండగానే ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. అది నిరాశపరచగా.. తర్వాత ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుని కూడా బాగానే ఆడింది. హీరోయిన్ శ్రీలీలతో పాటు రోషన్కూ మంచి పేరొచ్చింది.
దాంతో పాటే అవకాశాలూ వరుస కట్టాయి. ఐతే రోషన్ హడావుడిగా సినిమా చేసేయకుండా ఆచితూచి అడుగులు వేశాడు. ‘పెళ్ళి సంద-డి’ వచ్చిన నాలుగేళ్లకు కానీ తన తర్వాతి చిత్రం విడుదల కావట్లేదు. ఆ చిత్రమే.. ఛాంపియన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ లాంటి పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ రోజు రోషన్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిన్న టీజర్ ఒకటి వదిలింది చిత్ర బృందం.
‘ఛాంపియన్’ ఒక వింటేజ్ స్టోరీతో ముడిపడ్డ సినిమా అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. కొన్ని దశాబ్దాల వెనకటి నేపథ్యం కనిపించింది ఇందులో. రోషన్ వింటేజ్ లుక్స్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. దీంతో పాటు కథ వర్తమానంలోనూ నడిచేలా కనిపిస్తోంది. రెండు వేర్వేరు కాలాల్లో సాగే కథలకు ముడిపెట్టి సినిమాను నడిపించడం మంచి ఎత్తుగడే.
మామూలుగా స్టార్ హీరోలే ఇలాంటి కథల్లో నటిస్తుంటారు. వాళ్ల మీద పెద్ద బడ్జెట్లూ పెడతారు. కానీ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న హీరోతో ఇలాంటి కథ చేయడం, పెద్ద బడ్జెట్ పెట్టడం అంటే విశేషమే. ఈ విషయంలో స్వప్న సినిమాస్ ధైర్యంగానే అడుగు ముందుకు వేసింది. ఆ సంస్థకు ఆనంది ఆర్ట్స్‌తో పాటు మరో బేనర్ కూడా తోడైంది. ఇలా మూడు బేనర్లు కలిసి ఓ యంగ్ హీరో చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడమూ ప్రత్యేకమే.
‘సేవ్ ద టైగర్స్’ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చిన్న టీజర్‌తోనే ‘ఛాంపియన్’ బలమైన ఇంపాక్ట్ వేసింది. పేరుకు తగ్గట్లే ఇది క్రీడా నేపథ్యంలో సాగే మూవీ. ఫుట్‌బాల్‌ను కథా వస్తువుగా ఎంచుకున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘ఛాంపియన్’ విడుదల కానుంది.