ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారికి ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని వారికి సూచించారు.
వేలాది మంది ఆశావహులు పదవులు ఆశించారని, పదవుల ఎంపికపై సుదీర్ఘమైన, పటిష్టమైన కసరత్తు చేసి కష్టపడిన వారికి న్యాయం చేశామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సరైన వ్యక్తికి సరైన చోట టిక్కెట్ ఇచ్చే ప్రక్రియలో న్యాయం జరగని వారికి నామినేటెడ్ పదవులిచ్చామని చెప్పారు. ప్రతికూల
పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులిచ్చామని, గత ఐదేళ్ల కాలంలో కేసులు, దాడులు, వేధింపులకు గురైన వారిని గుర్తుపెట్టుకుని గౌరవించామని అన్నారు.
బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చే ఏకైక పార్టీగా మన తెలుగుదేశం నిలుస్తుందని, చాలా మంది బూత్ ఇంచార్జ్లు, క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇంచార్జ్లు, గ్రామ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామని చెప్పారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని పదవులు ఇస్తామని, గత 5 ఏళ్లు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, మెంబర్ షిప్ కార్యక్రమంలో, పార్టీ నిర్దేశించిన ఇతర లక్ష్యాలను చేరుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
పదవులు వచ్చిన నాయకులు, యువత రెండేళ్ల పదవీ కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రజల కోసం నిజాయితీగా, కష్టపడి పనిచేయడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుందని చంద్రబాబు అన్నారు. సింపుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే నినాదాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.