జనసేన లో కొన్ని అరాచకశక్తులు చేరాయంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా మీడియా ముఖంగా అగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు ఏర్పడటంతో.. చింతమనేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని చింతమనేని అన్నారు.
ఎన్నికల సమయంలో కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లేనని.. ఇప్పుడు జనసేనలో చేరి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు పెన్షన్ల పంపిణీతో వారికి ఏం సంబంధం? అని చింతమనేని ప్రశ్నించారు. పార్టీలో చేరి అధికారం చెలాయిస్తాం, దాడులు చేస్తామంటే కుదరదని.. సైలెంట్ గా ఉండాలని హితవు పలికారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని హెచ్చరించారు. అలాగే ఈ విషయమై తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని చింతమనేని అన్నారు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల దెందులూరు నియోజకవర్గం పైడిచింతలపాడులో స్థానిక సర్పంచ్ వర్గానికి చెందిన టీడీపీ నేతలను పిలవకుండానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముగించారు. ఇది టీడీపీ-జనసేన మధ్య వివాదానికి తెరలేపింది. పరస్పరం దాడి చేసుకోగా.. పలువురికి గాయాలు అయ్యాయి. విషయం పోలీసుల వరకు వెళ్లగా.. ఇరువర్గాల నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరాలు తీయగా.. టీడీపీ కార్యకర్తలపై గొడవకు దిగింది జనసేన కార్యకర్తలు కాదని, ఇటీవల ఆ పార్టీలో కొత్తగా చేరినవారేనని తేలింది. ఈ కారణంగానే జనసేనలో అరాచకశక్తులు చేరాయంటూ చింతమనేని తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.