ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. క్యాబినెట్ పంపకాలు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు అంటే జూన్ 26వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చేసి ఈనెల 24 నుంచి జరపాలని నిర్ణయించారు.
ఆ రోజు మొదటగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఆపై కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ ఎవరు..? అలాగే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఎవరికి ఇస్తారు..? వంటి విషయాలపై కూటమి నుంచి ఎటువంటి ప్రకటన లేదు. కానీ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు బలంగా టాక్ నడుస్తోంది.
అయ్యన్న పాత్రుడి పేరును దాదాపు ఖరారు అయినట్లేనని లీకులు సూచిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక చీఫ్ విప్‌గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఫైనల్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.