అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. AMANA జాతీయాధ్యక్షుడు అబ్దుల్ ఖుద్దుస్ ముల్లా, బే ఏరియా చాప్టర్ ప్రెసిడెంట్ కరిముల్లా షేక్, మరికొందరు సభ్యులు లోకేష్ ను కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో కలిశారు. వక్ఫ్ అమెండ్ మెంట్ బిల్-2024కు సంబంధించి తమకున్న అభ్యంతరాలు తెలుపుతూ లోకేష్ కు వారు ఒక మెమోరాండం ఇచ్చారు. మతపరమైన ఆస్తి హక్కులకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన రక్షణ, మతపరమైన ఆస్తుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పులకు ఆ బిల్లు విఘాతం కలిగిస్తుందని మెమోరాండంలో వారు వివరించారు.
వక్ఫ్ అమెండ్ మెంట్ బిల్-2024 పాసైతే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ యాక్ట్ బలహీనపడుతుందని, తద్వారా వక్ఫ్ ఆస్తుల జప్తునకు మార్గం సుగమం అయ్యే అవకాశముందని వారు పేర్కొన్నారు. ఈ మెమోరాండంపై, AMANA సభ్యుల విజ్ఞప్తిపై నారా లోకేష్ స్పందించారు. ప్రస్తుతం ఆ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉందని, ఈ మెమోరాండాన్ని, ముస్లిం సోదరుల అభ్యంరతాలను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మెమోరాండంలో లేవనెత్తిన అంశాలలో ముస్లిం సోదరులకు టీడీపీ మద్దతుగా ఉంటుందని లోకేష్ భరోసానిచ్చారు.
AMANA నేషనల్ జనరల్ సెక్రటరీ ఉమర్ షరీఫ్, బే ఏరియా చాప్టర్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ గౌస్ షేక్, AMANA కీలక సభ్యులు ఆరిఫ్ మహమ్మద్, కలీమ్ మహమ్మద్, ఆరిఫ్ మహమ్మద్ తదితులు లోకేష్ ను కలిశారు.