గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణతోపాటు దేశవిదేశాలలో ఉన్న తెలుగు ప్రజలలో డిప్యూటీ సీఎంగా లోకేశ్ కు ప్రమోషన్ అనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏదో చిన్నా చితకా లీడర్లు కాదు…టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…మాజీ ఎమ్మెల్యే వర్మ వంటి నేతలు కూడా ఈ డిమాండ్ ను తెరపైకి తేవడంతో ఈ విషయంపై జోరుగానే చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ హై కమాండ్ తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే, అనూహ్యంగా లోకేశ్ కాబోయే సీఎం అంటూ సీఎం చంద్రబాబు సమక్షంలోనే మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దావోస్ పర్యటన సందర్భంగా జ్యూరిచ్ లో ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఫ్యూచర్ లోకేష్ అని.. కాబోయే సీఎం కూడా లోకేషే అని భరత్ చేసిన కామెంట్లు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాదు, టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని కూడా భరత్ జోస్యం చెప్పారు. లోకేష్ ఉన్నత విద్యావంతుడని, 175 మంది ఎమ్మెల్యేల్లో, 25మంది ఎంపీల్లో స్టాన్ఫర్డ్ లో చదివింది లోకేశ్ ఒక్కరేనని అన్నారు. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న పార్టీ టీడీపీ అని, పార్టీ భవిష్యత్ లోకేష్ అని, కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషేనని అన్నారు. మరి, భరత్ అందుకున్న కొత్త నినాదంపై టీడీపీ హై కమాండ్ రియాక్షన్ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.