గత ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.40వేల కోట్ల రెమిటెన్స్
బ్రాండ్ సిబిఎన్ తో ఎపికి తరలి వస్తున్న ప్రముఖ కంపెనీలు
యూరప్ దేశాల్లో అవకాశాల కోసం ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ సెల్ ఏర్పాటు
దావోస్ /జ్యురిచ్ : రాష్ట్రంతో భావోద్వేగ బంధంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి ‘నారా లోకేష్’ పేర్కొన్నారు. 2023 ఆర్ బిఐ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐ ల ద్వారా భారతదేశంలోనే అత్యధికంగా 40,000 కోట్లకు పైగా రెమిటెన్స్‌లను అందుకుందని అన్నారు. జ్యురిచ్ లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి ‘నారా లోకేష్’ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నా దృష్టిలో మీరు ఎన్ఆర్ఐ (NRI)లు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు… అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (MRI ). తెలుగు ప్రవాసాంధ్రులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎపిలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు, అక్రమ అరెస్టులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మీరు భారీఎత్తున చేపట్టిన నిరసనలను యావత్ భారతదేశం చూసింది. ఎన్ఆర్ఐలపై మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో నలుగుర్ని ప్రవాసాంధ్రులను ఎమ్మెల్యేలను చేయడమేగాక, మరికొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చాం.
ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారిదే!
ఇక్కడ పరిస్థితులు చూస్తే నేను జ్యూరిచ్ లో ఉన్నానా, జువ్వలపాలెంలో ఉన్నానా అన్న అనుమానం కలుగుతోంది. జ్యురిచ్ లో ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారికి మాత్రమే ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వవిఖ్యాత స్వర్గీయ ‘నందమూరి తారకరామారావు’.
తెలుగువారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన విజనరీ ‘చంద్రన్న’. ఆనాడు విజన్ – 2020 అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు నాడు ఆయన చెప్పిన ప్రతి మాట నిజమైంది. న్యూయార్క్ లో చేతిలో ఫైల్… వెనక ఆఫీసర్లు… ఆ ఫోటో గుర్తుందా…మొదటిసారి సిఎం అయినపుడు మన ‘చంద్రన్న’ యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తేవాలని విదేశాల్లో పర్యటించేవారు. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్న హైదరాబాద్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్ తో ఆయన మళ్లీ పరుగెడుతున్నారు, మమ్మల్ని పరుగెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని ధైర్యంగా చెప్పలేదు, మేము చెప్పాం. మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగితే నేను ఒకటే చెబుతున్నా… మా ‘బ్రాండ్ సిబిఎన్’ అని. ‘సిబిఎన్’ పేరు చెప్పగానే ప్రపంచంలో ఏ కంపెనీ గేట్లు అయినా తెరుచుకుంటాయి. దట్ ఈజ్ ‘ద పవర్ ఆఫ్ సిబిఎన్’. ‘చంద్రబాబునాయుడు’ ఒక పారిశ్రామికవేత్త అనే విషయం చాలామందికి తెలియదు. నాలుగు కంపెనీలను స్థాపించి మూడు ఫెయిలయ్యాక, ‘హెరిటేజ్’ విషయంలో సక్సెస్ అయ్యారు.
తెలుగువారు ముందుండాలన్నదే చంద్రబాబు లక్ష్యం!
‘బాబు’గారిని అరెస్టు చేసి జైలులో పెట్టినపుడు కూడా ఆయన ఎక్కడా అధైర్య పడలేదు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడితే అంతిమంగా విజయం లభిస్తుందనడానికి ‘చంద్రబాబు’ గారే ఉదాహరణ. గత ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి 94శాతం సీట్లు సాధించాం. గత అయిదేళ్లలో అమరావతి ఉద్యమం కొనసాగించాం. ఉక్రెయిన్ లో తెలుగువారినకి సురక్షితంగా తెచ్చాం. పార్టీ ఆఫీసులో ఎంపవర్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి ట్రైనింగ్ ఇచ్చాం. నేను హెచ్ఆర్ డి మంత్రి అయ్యాక ఓంక్యాప్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. ఓవర్ సీస్ లో బ్లూకాలర్ జాబ్స్ కోసం ఒకప్పుడు ‘చంద్రబాబు’గారే ఓంక్యాప్ ను ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలన్నదే ‘చంద్రబాబు’ లక్ష్యం. ‘చంద్రబాబు’ గారితో పనిచేయడం అంత తేలికైన పనికాదు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు సెలవుపెట్టి భారత్ కు వచ్చి కూటమి విజయానికి కృషిచేశారు. అదే స్పూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేయాల్సి ఉంది. కలసికట్టుగా పనిచేసి అయిదేళ్లలో ప్రపంచానికి ఎపి అంటే ఏమిటో చేసి చూపిద్దాం. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనకాడం. ‘రెడ్ బుక్‘ పని మొదలైంది, పూర్తిచేసే బాధ్యత నాది.
విద్య, ఉద్యోగం, నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి!
విద్య, ఉద్యోగం, నైపుణ్యాలు దశాబ్ధాలుగా తెలుగువారిని విదేశాలకు వలసవెళ్లి స్థిరపడేలా చేశాయి. ప్రస్తుతం ‘చంద్రబాబు’ గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఈ మూడింటిని పునర్నిర్మించడం, ఆధునీకరించడంపై దృష్టిసారించింది. దీనివల్ల మన రాష్ట్ర యువత భవిష్యత్తులో వెలుపలకు వలస వెళ్లకుండా సొంతగడ్డపైనే సేవలందించాలన్నది మా అభిమతం. కొన్ని సంవత్సరాల క్రితం మేం బ్రెయిన్ డ్రైన్ పై ఆందోళన చెందాం. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధితో బ్రెయిన్ గెయిన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. భారత్ కు చెందిన ప్రవాసుల్లోని నైపుణ్యాలను గుర్తించిన పలు బహుళజాతి సంస్థలు నేడు ఎన్ఆర్ఐలను తమ సంస్థల్లో కీలక పదవుల్లో నియమించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అలాగే భారత్ లోని ఎంఎన్ సిలు గల్ఫ్, యూరప్ లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు సమాజానికి అవకాశాలను విస్తరించేందుకు అవసరమైన నెట్ వర్క్ ఏర్పాటులో ఎపి ఎన్ఆర్ టి చురుగ్గా పనిచేస్తోంది. గతంలో మన ప్రాంతానికి ఐటి రంగ విద్యావంతులను యుఎస్ఎ, ఇతర నైపుణ్యం గల కార్మికులను గల్ఫ్ దేశాలు ఆకర్షించేవి. ఇటీవల కాలంలో యూరప్ దేశాల్లో ఐటి, స్కిల్డ్ వర్కర్స్ కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
‘ఓంక్యాప్’ ను పునర్నిర్మిస్తున్నాం!
జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో రాబోయే అయిదేళ్లలో ’20 లక్షల ఉద్యోగాలు’ కల్పిస్తామని ఇచ్చిన హామీకి మేం కట్టుబడి ఉన్నాం. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగావకాశాల కోసం ‘ఓమ్‌క్యాప్’ను పునర్నిర్మిస్తున్నాం. దేశం వెలుపల మరిన్ని ఉద్యోగాలు పొందడానికి యువతకు నైపుణ్యం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యం ఏడాదికి లక్షకోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఒక అంచనా. అయితే ఇప్పటివరకు ఎన్ఆర్ టిలు కేవలం వృత్తినిపుణులుగా మాత్రమే మిగిలిపోవడంతో వ్యాపార కార్యకలాపాలను ప్రయోజనాలను పొందలేకపోయారు. యూరప్ లో వాణిజ్య విధానాలు, లాజిస్టిక్ వంటి అంశాలను తెలుసుకొని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలుగు ప్రవాసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు ప్రవాసులకు తగిన సహాయ, సహకారాలు అందించేందుకు ఎపి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ‘ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ సెల్’ ను ఏర్పాటు చేయబోతున్నాయి. యూరప్ లో అవకాశాలను ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన వనరులను’ ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ సెల్’ అందుబాటులోకి తెస్తుందని మంత్రి ‘లోకేష్’ పేర్కొన్నారు.