కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్, ట్రైనీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వైనం మరో నిర్భయ ఉదంతం మాదిరిగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ వైద్యురాలిని సంజయ్ రాయ్ రేప్ చేసి హత్య చేశాడని నిర్ధారించిన సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఆ రేపిస్టు కు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు వైద్య విద్యార్జథులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిందితుడ సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష పడుతుందని భావించామని దీదీ అన్నారు. అయితే, అంతటి హీనమైన చర్యకు పాల్పడ్డ వ్యక్తికి కేవలం జీవిత ఖైదు విధించడంపై దీదీ పెదవి విరిచారు. అంతేకాదు, ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు ఆ కేసును విచారణ జరిపి ఉంటే దోషికి మరణశిక్ష పడేలా 100 శాతం ప్రయత్నించే వారని చెప్పారు.
మరోవైపు, సీల్దా కోర్టు తీర్పుపై కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్య విద్యార్థులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీల్దా కోర్టు ఎదుట విద్యార్థుల నిరసనకు దిగారు. దోషి సంజయ్ కు ఉరిశిక్ష విధించాలని భారీ సంఖ్యలో విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాదు, తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని, ఈ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. అయితే, అరుదైన కేసు కేటగిరీలోకి ఈ కేసు రాదని, అందుకే దోషి సంజయ్ కు మరణ శిక్ష విధించలేదని కోర్టు తెలిపింది.