మంత్రి నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ టీడీపీ నేతలు కొందరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజలకు చేరువయ్యారని, కూటమి గెలుపులో యువగళం కీలక పాత్ర పోషించిందని, అందుకే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో, జనసేన అధినేత పవన్ ను సీఎం చేయాలని కొందరు జనసేన నేతలు మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు మీడియాలో చర్చనీయాంశం కాగా..సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన చర్చకు దారి తీసింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం స్పందించింది. అటువంటి డిమాండ్లను తీసుకురావద్దని, ఆ విషయం గురించి ఎవరూ మీడియా ముందు మాట్లాడవద్దని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాలేదని, ఇటువంటి డిమాండ్లు సరికాదని తెలిపింది. ఆ విషయంపై టీడీపీ నేతలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించ వద్దని తేల్చి చెప్పింది. అటువంటి విషయాలపై కూటమి నేతలు సమిష్టిగా చర్చించిన తర్వాతే నిర్ణయాలుంటాయని చెప్పింది.
కాగా, టీడీపీకి కోటి సభ్యత్వాలు చేయించిన లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని, ఆయన ఆ పదవికి 100శాతం అర్హులని పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్న సంగతి తెలిసిందే. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారికి ‘యువగళం’తో లోకేశ్ సమాధానమిచ్చారని అన్నారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పారు.
ఇక, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. అయితే, తాము కూడా పవన్ కల్యాణ్ ఏపీ సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. పవన్ సీఎం కావాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని అన్నారు. ఇలా, టీడీపీ..జనసేన నేతల మధ్య అభిప్రాయలు వెలువుడుతున్న నేపథ్యంలోనే టీడీపీ హై కమాండ్ తాజాగా ఆ ప్రకటన చేసింది.