సీనియర్ హీరోలకు హీరోయిన్లను జోడీ గా సెట్ చేయడం ఇప్పుడు పెద్ద టాస్కుగా మారిపోయింది. ఒకప్పుడంటే హీరోల వయసులో మూడో వంతు వయసున్న కథానాయికలతో జోడీ కట్టించినా చెల్లిపోయింది. కానీ ఇప్పుడలా చేస్తే ఎంత పెద్ద హీరో అయినా సరే ట్రోల్స్ తప్పట్లేదు. వయసు మళ్లిన హీరోల పక్కన మరీ చిన్నగా కనిపించే కథానాయికలను పెడితే చాలా ఆడ్‌గా కనిపిస్తోంది. దాని వల్ల సినిమాలు కూడా దెబ్బ తింటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వయసు తక్కువ అయినా సరే.. జోడీ కుదిరేలా చూసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి చివరి చిత్రం ‘భోళా శంకర్’లో ఆయనకు, తమన్నాకు అస్సలు జోడీ కుదరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో చిరు చేయబోయే సినిమాలో ఆయనకు హీరోయిన్ని సెట్ చేయడం అనిల్ రావిపూడికి సవాలుగా మారింది.
ఐతే ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకీకి ఐశ్వర్య రాజేష్‌తో జోడీ కట్టించి మెప్పించిన అనిల్ రావిపూడి.. చిరు విషయంలో కూడా తెలివైన ఎత్తుగడే వేసినట్లు సమాచారం.
చిరుకు ఒక సరికొత్త జోడీని సెట్ చేస్తున్నాడట అనిల్. అదితి రావు హైదరిని చిరు పక్కన హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నాడట. అదితి యంగ్ హీరోలతోనే కాక మిడిల్ ఏజ్డ్ హీరోలతోనూ జట్టు కట్టి మెప్పించింది. చిరు పక్కన కూడా అదితి బాగానే సూట్ కావచ్చని అనిపిస్తోంది. అదితి వయసు 46 ఏళ్లు కాబట్టి చిరు పక్కన చిన్న పిల్లలాగా అనిపించే అవకాశం లేదు.
ఈ సినిమా కోసం ఓవైపు స్క్రిప్టు పనులు జోరుగా సాగుతుండగా.. ఇంకోవైపు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక మీద కూడా దృష్టిపెట్టారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సత్తా చాటిన భీమ్స్ సిసిరోలియోనే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారట. ఇంకో రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చు.