టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ చాలా కచ్చితమైన మనిషి అని ఆయనతో పని చేసిన వాళ్లు అంటారు. ‘తండేల్’ సినిమా కోసం స్వరపరిచిన పాటను సినిమా నుంచి తీసేశారని.. ఓటీటీ వెర్షన్లో సైతం ఆ పాట పెట్టడానికి దేవి ఒప్పుకోలేదని దర్శకుడు చందూ మొండేటి చెప్పడాన్ని బట్టి దేవి ఎంత పర్టికులర్‌గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
తనకంటూ కొన్ని పద్ధతులు పెట్టుకుని వాటిని ఫాలో అయిపోయే దేవి.. దానికి భిన్నంగా ఏదైనా చేయాల్సి వస్తే అస్సలు రాజీ పడడని అంటారు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లాల్సి వస్తే తనతో చాలా క్లోజ్‌గా ఉండే దర్శకుల మాట కూడా దేవి వినడన్నది ఇండస్ట్రీ టాక్. రీమేక్ పాటలు చేయకూడదు అన్నది దేవి ఎప్పుడో తనకు తాను పెట్టుకున్న నియమం. దాన్ని బ్రేక్ చేయమని దర్శకుడు హరీష్ శంకర్ అడిగేసరికి.. ‘గద్దలకొండ గణేష్’ చిత్రం నుంచి బయటికి వచ్చేసినట్లు దేవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘గద్దలకొండ గణేష్’ కోసం వెల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమేక్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను మిక్కీ జే మేయర్ బాగానే స్వరపరిచాడు. కానీ ఇదే పని దేవిని చేయమంటే ఆ సినిమానే వదులుకున్నట్లు తెలిపాడు. హరీష్ శంకర్ తనకు క్లోజ్ అయినప్పటికీ ఆ పని తాను చేయలేదని దేవి చెప్పాడు. ఐతే హరీష్ తన ఇబ్బందిని అర్థం చేసుకుని వేరే సంగీత దర్శకుడితో పని చేయించుకున్నట్లు దేవి తెలిపాడు.
మరో పాట నుంచి స్ఫూర్తి పొందడంలో తప్పు లేదని.. కాపీ కొట్టడం మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డ దేవి.. తన పాటలను చాలామంది కాపీ కొట్టారని అన్నాడు. తాను రీమేక్స్ ఎప్పుడూ చేయనని అతను స్పష్టం చేశాడు. ‘ఉప్పెన’ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ట్యూన్ విన్న సుకుమార్.. తన శిష్యుడు కాబట్టి బుచ్చిబాబు సినిమాలో ఈ పాట పెట్టడానికి ఒప్పుకుంటున్నానని, లేదంటే తన సినిమాలోనే పెట్టుకునేవాడినని వ్యాఖ్యానించినట్లు దేవి తెలిపాడు. ఇదే సినిమా కోసం చేసిన ‘జలజల..’ పాట విన్న బుచ్చిబాబు ఈ సినిమాను ‘నా కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావు’ అని కామెంట్ చేశాడన్నాడు.