మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి క్యాన్సిల్ అయ్యిందా..? అన్న విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు నాగబాబు ఎమ్మెల్సీ అవ్వడం.. ఆ వెంటనే ఏపీ మంత్రివర్గంలో చోటు తగ్గించుకోవడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ప్రకటించడంతో జనసైనికులు తెగ సంబర పడిపోయారు. కానీ అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి లేనట్లే అని.. ఎమ్మెల్యే కూడా ఆయనకు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలు జనసేనలో ఏం జరుగుతుంది అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి పెద్దల సభకు వెళ్లాలని నాగబాబు ముందు నుంచి ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పార్లమెంట్ లో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నారు. పైగా ఏపీ మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు ఉండగా.. వారిలో పవన్, కందుల దుర్గేష్ ఒకే సమాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు నాగబాబు కూడా చేరితే జనసేన కాపుల పార్టీగా ముద్ర పడిపోతుంది. ఇది పవన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.
మరోవైపు గత ఏడాది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోపం పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మ.. త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీలో ఒకటి దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. చంద్రబాబు కూడా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ లో నాగబాబు ఎంటర్ అవ్వడంతో.. వర్మ ఏమాత్రం సహించలేకపోతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజ్యసభ వైపు మొగ్గు చూపారట.
తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన పవన్ నుంచి స్వయంగా రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేయాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు నిర్ణయించారట. తొలుత నాగబాబుకు కార్పరేషన్ పదవి ఇచ్చి.. ఆపై రాజ్యసభకు పంపాలని ఇరుపార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటును బీజేపీ ఆశిస్తుంది. కానీ, ఇప్పుడు నాగబాబు పేరు తెరపైకి రావడంతో.. ఆయన తీసుకోవాల్సిన ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి దక్కొచ్చని అంటున్నారు.