ఛత్తీస్ గఢ్ లోని సుక్మా–బీజాపూర్ సరిహద్దుల్లో శనివారంనాడు భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. చత్తీస్ గఢ్ లో భధ్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులో మందుపాతరలు పేల్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల జవాన్లు గల్లంతయ్యారు. తొలుత ఈ ఘటనలో 5 గురు జవాన్లు మరణించారని భావించారు.
అయితే,.ఆదివారం మధ్యాహ్నం నాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరడంతో వారి కుటుంబాలు పెను విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన జవాన్ల కోసం అదనపు బలగాలు గాలిస్తున్న తరుణంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం మరో మందుపాతరను మావోలు పేల్చిన ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడ్డ జవానును సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
24 మంది మృతుల్లో 9 మంది కోబ్రా దళాలకు చెందిన వారు కాగా, 8 మంది డీఆర్జీ సిబ్బంది, ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఓ బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. ఈ దాడిలో మరో 31 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉండగా…31 మంది క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, నక్సల్స్ దాడి ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
భద్రతా సిబ్బంది నుంచి నక్సలైట్లు భారీగా ఆయుధాలను దోచుకెళ్లారని తెలుస్తోంది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా రణభూమిని తలపిస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులూ హతమైనట్టు అధికారులు చెబుతున్నారు. జవాన్ల మృతి పట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేసి వారికి నివాళులు అర్పించారు. వారి త్యాగాన్ని దేశ ప్రజలెన్నడూ మరచిపోరని, చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.