ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆ వేడుకకు సంబంధించిన అంశాలు వార్తలుగా అందరిని ఆకర్షిస్తున్నాయి. నెలన్నర పాటు సాగిన ఈ మేళాకు 62 కోట్ల మంది భక్తులు రావటం.. పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు సంబంధించి పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
కుంభమేళాపై ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేడుక కారణంగా ఎంతోమంది లాభపడ్డారని చెప్పారు. ఒక కుటుంబం 130 పడవలను నడిపిస్తూ రూ.30 కోట్లు ఆర్జించినట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండానే మహాకుంభ మేళా విజయవంతంగా నిర్వహించినట్లుగా పేర్కొన్న యోగి.. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని చెప్పటం గమనార్హం.
అయితే.. యోగి మాటల్ని విన్నంతనే.. పుణ్యస్నానాలు ఆచరించే మహిళల ఫోటోల్ని.. వీడియోల్ని తీసి అమ్మకాలకు పెట్టిన ఉదంతాన్ని గుర్తించటం..వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. మరి.. ఇవేమీ నేరాలు కావా? అన్న సందేహం రావటం ఖాయం. మహాకుంభమేళా భారీగా నిర్వహించటం.. కోట్లాది మంది భక్తులు వచ్చినప్పటికీ.. తీవ్రమైన అసౌకర్యం కలగకుండా చేయటంలో యోగి సర్కారు సక్సెస్ అయిన విషయాన్ని అంగీకరించాలి. కాకుంటే.. ఒక్క నేరం జరగలేదంటూ చెప్పే అతిశయోక్తుల విషయంలోనే అభ్యంతరమంతా.