బెంగళూరు విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక.. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే దుబాయ్ కేంద్రంగా సాగే బంగారు స్మగ్లింగ్ గుట్టు రట్టు కావొచ్చని భావిస్తున్నారు. అందుకే ఆమెను కస్టడీ కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్న మరో అంశం ఏమంటే.. నటి రన్యారావు ఒక ఐపీఎస్ కుమార్తెనా? అని. అసలు విషయంలోకి వెళితే రన్య తండ్రి కె. రామచంద్రరావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా పని చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే.. రన్యకు ఆయన అసలు తండ్రి కాదని.. సవతి తండ్రిగా గుర్తించారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఉదంతం నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.
ఆమె కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని.. నాలుగు నెలల క్రితం ఆమెకు పెళ్లైందన్నారు.
పెళ్లైన తర్వాత నుంచి ఆమె ఇంటికి రావటం లేదన్న ఆయన.. భర్తతో పాటు ఆమె ఎలాంటి వ్యాపారాల్ని చేస్తుందో తమకు తెలీదన్నారు. తాజా పరిణామంతో మాత్రం తాము షాక్ కు గురైనట్లుగా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఈ ఉదంతంపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పందించారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన డీఆర్ఐ దర్యాప్తు చేస్తుందని.. ఇప్పడు తానేమీ చెప్పలేనని స్పష్టం చేశారు.
రన్యారావు అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేష్. సినీ రంగంలో రాణించేందుకు పేరు మార్చుకుంటే మొత్తం మారిపోతుందన్న మాటతో పేరు మార్చుకున్నట్లు చెబుతారు. ఓవైపు అందం.. మరోవైపు సవతి తండ్రి అధికారం.. వెరసి ఆమె వ్యవహారశైలే వేరుగా చెబుతారు. తాజాగా భారీగా బంగారంతో దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలోకి వెళితే.. ఆమె తరచూ దుబాయ్ వెళ్లి రావటంతో డీఆర్ఐ అధికారులు ఆమె మీద ఫోకస్ చేశారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు పదిసార్లు దుబాయ్ వెళ్లి రాగా.. గడిచిన పదిహేను రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి రావటం ఒక ఎత్తు అయితే.. దుబాయ్ కు వెళ్లిన ప్రతిసారీ ఒకేరకమైన డ్రెస్ తో ఆమె బెంగళూరు ఎయిర్ పోర్టుకు ల్యాండ్ కావటాన్ని అధికారులు గుర్తించారు. తన సవతి తండ్రి హోదాను వాడేసిన ఆమె.. ఒక కానిస్టేబుల్ సాయంతో రెండు.. మూడు తనిఖీ కేంద్రాల్ని సులువుగా దాటేసి బయటకు వచ్చారు. చివరి తనిఖీ కేంద్రం వద్దనే ఆమె పప్పులు ఉడకలేదు.
విస్మయానికి గురి చేసే అంశం ఏమంటే.. భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నప్పటికి ఎలాంటి తడబాటు.. టెన్షన్ లేకుండా ధీమాగా వ్యవహరించటం అధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గతంలో స్మగ్లింగ్ చేసిన వేళలో.. తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకొని పోలీసు ఎస్కార్ట్ తోనే ఇంటికి వెళ్లేదని గుర్తించారు. ఆమె బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయానికి వస్తే.. తొడలకు జిగురు రాసుకొని 14 బంగారు బిస్కెట్లను అంటించుకొని.. దానికో టేపు.. మరో వరస క్రేప్ బ్యాండేజ్ వేసుకోవటాన్ని గుర్తించారు.
అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొందరు రాజకీయ నేతలు.. అధికారులు.. నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్ కి తరలిస్తే.. దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. భారీగా బంగారాన్ని రహస్యంగా తీసుకొస్తు దొరికిన నేపథ్యంలో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమె నివాసం ఉండే ల్యావెల్లీ రోడ్డులోని ఖరీదైన ప్లాట్ లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 14.2కేజీల బంగారాన్ని.. రూ.2.67 కోట్ల క్యాష్ ను.. 600 గ్రాముల ఆభరణాల్ని జప్తు చేశారు. వీటి మొత్తం విలువ రూ.17.29 కోట్లు ఉంటుందని తేల్చారు.
విచారణలో తనను స్మగ్లింగ్ చేయాలని బ్లాక్ మొయిల్ చేశారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ ను అధికారులు విచారించారు. త్వరలోనే ఆమె భర్తను కూడా విచారిస్తారని చెబుతున్నారు. ఏమైనా ఇంత పక్కా ప్లానింగ్ తో బంగారాన్ని స్మగ్లింగ్ చేయటమంటే.. దాని వెనుక కత చాలా పెద్దదిగా ఉండి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.