ఆసక్తికర వ్యాఖ్యలు చేయటంతో పాటు భారత్ గొప్పతనాన్ని చాటి చెప్పారు రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ గుర్తించటానికి చాలా కాలం పూర్వమే మన వేదాల్లో వాటి ప్రస్తావన ఉందన్నారు. జైపూర్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురాతన కాలంనుంచి భారత్ విజ్ఞాన కేంద్రంగా ఉందన్నారు.
‘నలంద విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలకు దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. డెసిమల్ వ్యవస్థను భారతే ప్రపంచానికి అందించింది. గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి న్యూటన్ చాలా ఆలస్యంగా చెప్పారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ చెప్పారు. అంతకు చాలా పూర్వమే మన వేదాల్లో గ్రావిటీని ప్రస్తావించారు. విద్యుత్.. విమానాలు ఇలా చాలాఅంశాలు మన చరిత్ర పుస్తకాల్లో.. రుగ్వేదంలో ఉన్నాయి’అని చెప్పుకొచ్చారు.
మన జ్ఞానాన్ని అణిచివేసేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయన్న గవర్నర్.. భారత్ పురాతన విజ్ఞానాన్ని చెరిపేసేందుకు కొందరు కుట్రలు చేశారంటూ.. ‘‘1190లలో నలంద లైబ్రరీ దహనమే దీనికి ఉదాహరణ’’ అని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదన్నారు. నలంద విశ్వవిద్యాలయాన్ని సరికొత్త రూపులో త్వరలో తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు.