వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఊహించని పరిణామాల నడుమ అరెస్టు అయ్యారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై సీఎం చంద్రబాబు వేటు వేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయించారు. అయితే కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి నుంచి గుంటూరు పీఎస్కు తరలిస్తుండగా సడెన్ గా ప్రత్యక్షమయ్యారు గోరంట్ల మాధవ్.
నిన్నొదలను.. నీ అంతు చూస్తా.. అంటూ పోలీసుల వాహనాన్ని గుంటూరు వరకు వెంబడిస్తూ రచ్చరచ్చ చేశారు. పోలీసుల సమక్షంలోనే నిందితుడు కిరణ్ ను బెదిరించడమే గాక దాడికి ప్రయత్నించారు. దీంతో విధులకు ఆటకం కలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు మాధవ్ ను నడిరోడ్డు పైనే అరెస్ట్ చేశారు. ఒక కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని పీఎస్కు తరలించడాన్ని అడ్డుకోవడం అనేది పోలీసుల విధులకు నిజంగా ఆటంకం కలిగించడమే. పోలీస్ శాఖ నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్ కు కూడా ఈ విషయం బాగా తెలుసు.
అయినాసరే పనిగట్టుకుని గోరంట్ల పోలీసులకు ఎదురెళ్లడం వెనుక బలమైన కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా గోరంట్ల పని చేశారు. ఆ సమయంలో అనంతపురం ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డికి ఓ వివాదంలో ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడితే నాలుక చీరేస్తానంటూ హెచ్చరించి గోరంట్ల ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ఆ తర్వాత పోలీస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన గోరంట్ల వైసీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎంపీ అయ్యాక పాలన కన్నా వివాదాల వైపే ఆయన ఎక్కువ మొగ్గు చూపారు. వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు న్యూడ్ వీడియోతో కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేసుకున్న గోరంట్లను జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత కూడా ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడంతో.. గోరంట్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లా కర్నూలు లేదా అనంతపురం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని గోరంట్ల జగన్ వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడు కూడా జగన్ మెప్పు కోసమే కిరణ్ పై దాడికి దిగి అరెస్ట్ అయ్యారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.