దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 8వ తేదీన మోదీ పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నరు. మోదీ ఏపీ టూర్ కు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ .. విశాఖలో జరగబోయే బహిరంగసభ భారీ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ ఛీప్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని, ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని షర్మిల మండిపడ్డారు. `ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలి.
ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలి. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలి. 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలి. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు 3 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే మోడీ గారు విశాఖలో అడుగుపెట్టాలి` అంటూ షర్మిల డిమాండ్ చేశారు.