ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం చూస్తే మరో తొమ్మిది నెలలు.. కొందరు అధినేతల అంచనాల్ని చూస్తే.. ఆర్నెల్లలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయన్నది తెలిసిందే. ఏది ఏమైనా..మూడు నాలుగు నెలల తేడాతో ఎన్నికలు రావటం ఖాయం. మొత్తంగా ఎన్నికల ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది. ఇలాంటి వేళ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పట్ల ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న అంచనా ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఎవరికి వారు చెప్పే అభిప్రాయాలకు.. కొన్ని కీలక స్థానాల్లో ఉన్న వారు.. మేధావి వర్గానికి చెందిన కొందరి మాటలకు ఉండే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది.
ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిన ప్రముఖుడి మాటనే. తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు హైకోర్టు అడ్వకేట్ కమ్ జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై తన అంచనాను వినిపించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఏ మాత్రం నచ్చని మాటలు ఆయన నోటి నుంచి రావటం గమనార్హం.
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి పాతిక మించిన సీట్లు రావన్నారు. కేంద్రం దగ్గర పక్కాగా నివేదిక ఉందని.. దాన్ని చూసే జగన్ ను సాగనంపేందుకు కేంద్రం సిద్ధమైందన్న వ్యాఖ్య చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా పులివెందులలో కూడా జగన్ గెలిచే పరిస్థితి లేదన్న వ్యాఖ్య వైరల్ గా మారింది.
వైసీపీకి పాతిక సీట్లు కూడా రావన్న ఆయన.. ఎస్సీ.. ఎస్టీ బీసీలను దారుణంగా కొట్టి చంపిన జగన్ పార్టీకి అసలు ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. 2019-23 మధ్య కనీసం వంద టిడ్కో ఇళ్లను కూడా జగన్ ప్రభుత్వం కట్టలేదన్నారు. టిడ్కో ఇళ్ల మీద జగన్.. ఆయన మంత్రులు అడ్డగోలు వాదనల్ని ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ పార్టీ రంగుల్ని ఇళ్లకు వేసి ఇస్తున్నవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనన్న ఆయన.. వాటికి సంబంధించిన ఆధారాల్ని ఇచ్చారు.
గుడివాడలో 8912 ఇళ్లను ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పారన్నారు. అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే క్రిష్ణా జిల్లాలో ఇప్పటివరకు 11,250టిడ్కో ఇళ్లు మంజూరు అయితే.. వాటిలో కేవలం 1680 మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. అలాంటప్పుడు గుడివాడలో 8 వేలకు పైగా ఇళ్లు ఎలా? అంటూ సూటి ప్రశ్నను సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయి? ఎన్ని పూర్తి అయ్యాయి? అన్న అంశాలకు సంబంధించి తన వద్ద పక్కా లెక్కలు ఉన్నట్లుగా చెప్పారు. మరి..ఈ మాజీ జడ్జి చెప్పిన లెక్కలకు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్లు వేస్తారో చూడాలి.