స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉంటున్నాయి. ఆ అంచనాలను టీం అందుకోలేనప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు గోల చేయడం సహజం. అయితే ట్రోలింగ్ శృతి మించినప్పుడు టీం సభ్యులకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ఓ మై బేబీ విషయంలో ఇలాంటి గొడవే నడుస్తుంది.
ఈ పాట ట్యూన్, లిరిక్స్ విషయంలో మహేష్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సంగీత దర్శకుడు తమన్ తో పాటు గేయ రచయిత రామజోగయ్యశాస్త్రిని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. తమన్ కు ఇలాంటి ట్రోలింగ్స్ మామూలే కాబట్టి తీసుకున్నట్లు ఉన్నాడు కానీ.. రామజోగయ్యశాస్త్రి మాత్రం ఈ వ్యతిరేకతను తట్టుకోలేకపోయారు. లిరిక్స్ విషయంలో తనను తీవ్రస్థాయిలో దూషిస్తున్న నెటిజన్ల తీరును ఆయన తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. ఈ విషయమై వరుసగా ఆయన ట్వీట్లు వేశారు.