రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ప్రత్యేకించి చెప్పలేని పరిస్థితి. అంచనాలు ఒకలా.. వాస్తవాలు మరోలా ఉండటం కామనే. తాము వేసిన అంచనాలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నలుగురు రెబల్ తమ్ముళ్లు ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చూసిన టీడీపీ.. కేవలం 23 మంది ఎమ్మెల్యేల్ని మాత్రమే గెలిపించుకోగలిగింది. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు జనగ్ ప్రభుత్వానికి జై కొట్టటమే కాదు.. ఆ పార్టీకి జంప్ అయినట్లుగా చెప్పాలి.
అధికారికంగా పార్టీ మారనప్పటికీ.. టీడీపీలోనే ఉంటూ.. వైసీపీకి ఓపెన్ గా మద్దతు ఇస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో కాదు.. టీడీపీకి హార్డ్ కోర్ కార్యకర్తగా పేరున్న క్రిష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరైతే.. రెండో ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నుంచి టీడీపీ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన మద్దాల గిరి. ఇక.. సీనియర్ నేతగా టీడీపీలో సుపరిచితుడైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మూడో నేత కాగా.. నాలుగో నేత విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేశ్ గా చెప్పాలి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికి టీడీపీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. వారి మాటలు చేతలన్ని కూడా అధికారపార్టీ తరఫునే పని చేస్తున్నాయని అందరికి తెలిసిందే.
పార్టీ మారి వైసీపీ కండువాలు మెడలో వేసుకోలేదు కానీ.. వారి మాటలన్నిజగన్ చుట్టూనే తిరగటం తెలిసిందే. అంతే కాదు.. పాత పార్టీని వదిలేసి కొత్త పార్టీలోకి చేరేందుకు సిద్ధమైన వారంతా.. తమ కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని ప్రదర్శించుకోవటంతో పాటు.. జగన్ మీద తమకున్న స్వామిభక్తిని నిరూపించుకోవటం కోసం తమ మాజీ బాస్ చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. తిట్టాల్సిన అవసరం లేకున్నా.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వైసీపీ నేతలు సైతం చేయలేని పనిని తాము మాత్రమే చేస్తున్నట్లుగా వ్యవహరించేవారు. వైసీపీ నేతలు చంద్రబాబు తిట్టే దానితో పోలిస్తే.. పార్టీ టికెట్ మీద గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నేతల చేత తిట్టిస్తే వచ్చే పొలిటికల్ మైలేజీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో.. అలాంటి తిట్ల కార్యక్రమాన్ని అధికార పార్టీ కూడా ఎంకరేజ్ చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. పార్టీ మారితే ఎమ్మెల్యే గిరి పోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. అధికారికంగా పార్టీలో చేరని నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. తాము తప్పు చేశామా? తొందరపాటుతో వ్యవహరించామా? అన్న సందేహం వారి మదిలో మెదులుతుందన్న మాట చెబుతున్నారు. ఉన్న పార్టీ పోయిందని.. కొత్త పార్టీలో తమకు దక్కాల్సినంత గౌరవ మర్యాదలు దక్కటం లేదని వాపోతున్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు..వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవటమే కాదు.. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చేయటం తెలిసిందే.
అదే రీతిలో జగన్ కూడా తమకు మంత్రి పదవులు.. లేదంటే కీలకమైన అధికారాలుకట్టబెడతారని భావించిన నలుగురికి.. వైసీపీ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీలోకి వస్తే.. అప్పటికే పార్టీలో ఉన్న వారింతా తమ ఫ్యూచర్ మీద బెంగపడుతున్నారు. దీంతో.. తమ్ముళ్లకు చెక్ పెట్టేప్రయత్నాలు ముమ్మరంచేస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా చీరాల నియోజకవర్గ రాజకీయమే. అక్కడ వైసీపీ నేతగా ఉన్న అమంచి క్రిష్ణమోహన్ కు.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. దీంతో నిత్యం పంచాయితీలే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ ఇష్యూను పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా సెటిల్ చేస్తారంటే.. ఆయన పట్టించుకోనట్లుగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
దీంతో.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా నలుగురు టీడీపీ (?) ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలన్నది అర్థం కావట్లేదని వారు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో తమకు జగన్ టికెట్లు ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందంటున్నారు. పార్టీ వీడిన సంకేతాలతో.. తమకు పదవులు లభిస్తాయని.. అందుకు రంగం సిద్దం చేసుకున్న తర్వాత అధికారికంగా పార్టీకి గుడ్ బై చెప్పాలన్న యోచనలో ఉన్న వారికి.. జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు అందటం లేదంటున్నారు. దీంతో.. చంద్రబాబుపై ఒంటికాలిపై లేచిన నేతలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారిందన్న మాట వినిపిస్తోంది.