మంత్రులు అంటే.. ఎంతో ఉన్నతంగా వ్యవహరిస్తారని.. రాజకీయాలకు వారు మంచి పేరు తెస్తారని.. ఏదై నా మాట్లాడితే.. ఆచితూచి వ్యవహరిస్తారని.. అందరూ అనుకుంటారు. గతంలో అంటే.. ఓ దశాబ్దంన్నర వరకు.. కూడా.. మంత్రులు అనగానే ఇలాంటివే గుర్తుకు వచ్చేవి.
మంత్రులుగా ఆయా శాఖలకు, సీట్లకు కూడా సమున్నత గౌరవాన్ని ఆపాదించిన వారు ఉన్నారు. అయితే.. రాను రాను.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు.. వివాదాలకు.. కేంద్రంగా మారుతున్నారు. కనీసం ఆలోచన లేకుండా.. విజ్ఞత కూడా పాటించకుండా.. నోటికి ఏదివస్తే.. అదే మాట్లాడేస్తున్నారు. తొడచరిచి సవాళ్లు రువ్వుతున్నారు.
వాస్తవానికి రాజకీయాలు అంటేనే.. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. అదేసమయంలో మీడియా కూడా `వాచ్ డాగ్` మాదిరిగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాల్లోని లోపాలను ఎండగడుతుంది. సలహాలు ఇస్తుంది. దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రులు సమాధానం ఇవ్వొచ్చు.. వ్యాఖ్యలు చేయొచ్చు.
అయితే.. ఏదైనా కూడా ప్రజాస్వామ్య యుతంగా.. సమాజం హర్షించేలా ఉండాలి తప్ప.. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేది.. ప్రత్యర్థుల నోటికి తాళం వేశామని మురిసిపోతుండడం ఆయా నేతలకు చెల్లినా..నిశితంగా గమనిస్తున్న ప్రజలు మాత్రం వీరి దూకుడును ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉన్నా రు.
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. మంత్రి కొడాలి నాని.. తీవ్ర వివాదం అయ్యారు. `అమ్మ మొగుడు` అనే పదాన్ని ఆయన అలవోకగా అనడంతోపాటు.. ప్రతిపక్ష నేతలను వాడు-వీడు అనడం.. ఆయనకు రాజకీయంగా వచ్చిన అలవాటుగా మారింది. కానీ, ఇది ప్రజాస్వామ్యం.
ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉన్నా.. వేరే ఏదైనా ఉన్నా పర్సనల్‌గా చూసుకోవాలి .. తప్ప.. బహిరంగంగా మాత్రం కాదు. కానీ, ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇక, మరో మంత్రి.. అనిల్ కుమార్.. కూడా ఇంతే! అయితే.. నాని అంత ఫైర్ కాకపోయినా.. సంయమనం కోల్పోవడం.. సవాళ్లు రువ్వడంలో ముందున్న మంత్రిగా పేరుంది.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. చేసే సవాళ్లు.. అనే మాటలు ఒక్కొక్కసారి.. సొంత పార్టీలోనే చర్చకు దారితీస్తున్నాయి. అరెయ్-ఒరేయ్ అనడం.. ఏంది నీలొల్లి.. అంటూ.. విరుచు కుపడడం.. ఏకవచన సంబోధన.. వంటివి.. తలసానికి రాజకీయంగా వచ్చిన మార్కు అననుకోవాలా.? లేక మరేంటి? ఇక, ఈ జాబితాలో ఇప్పుడు మరోమంత్రి మల్లా రెడ్డి కూడా చేరిపోయారు.
కాంగ్రెస్ రాష్ట్ర సారథి రేవంత్‌పై తీవ్రస్థాయిలో మాటలు లంఘించుకున్నారు. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తే.. తాను అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. రేవంత్‌రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. తనను ఒక్కమాట అంటే.. పది మాటలు అని చూపిస్తానని, రేవంత్‌రెడ్డి తిడితే తాను పడాలా? అంటూ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇన్ని సావధాన మాటలు చెబుతూనే.. రేవంత్‌పై బూతుల పర్వం అందుకున్నారు.
ఇది మంత్రుల పరిస్థితి. ఇక, నేతల విషయాన్ని తీసుకున్నా.. అటు ఏపీ, ఇటు తెలంగాణలో నేతలు.. ప్రత్యర్థి పార్టీ నేతలపై దూకుడుగానే ఉన్నారు. ఇటీవల .. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. బండి సంజయ్‌పై అరెయ్.. ఒరేయ్.. నీ అంతు తేలుస్తా.. అరెయ్ బండిగా! అంటూ.. విరుచుకుపడ్డారు. మరి ఈ సంప్రదాయం.. ఎటు దారితీస్తుందో చూడాలి.