వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి మరోసారి బిగ్ షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అపహరించిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వంశీ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. నేటితో వంశీ రిమాండ్ ముగియడంతో జైలు అధికారులు వంశీని నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
వంశీకి 2025 మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు జిల్లా జైలులో ఉన్నారు. అయితే ఇటీవల కస్టడీలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటి వేసిన నేపథ్యంలో మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. మూడు రోజుల వాదనల అనంతరం కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
కస్టడీ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఓవైపు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాధించగా.. మరోవైపు బెయిల్ ఇస్తే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.