రాజ్యసభ సభ్యుడి హోదాకు రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉంటానని.. వ్యవసాయం చేసుకుంటానంటూ పోస్టులు పెట్టి.. రాజీనామా చేసేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది. తీవ్ర ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఐడీ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంతకూ ఏ కేసులో విజయసాయికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారన్న విషయంలోకి వెళితే..
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్.. కాకినాడ సెజ్ ల్లో రూ.3600 కోట్ల విలువైన వాటాల్ని వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారని.. కారుచౌక ధరకు తమ సొంతం చేసుకున్నట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే తాజాగా విజయసాయి రెడ్డికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో బుధవారం ఉదయం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు.
నిజానికి రెండు రోజుల క్రితం సాయిరెడ్డి ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులకు..ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఏ2గా విజయసాయి కాగా.. ఏ1గా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే.
బలవంతంగా వాటాలు లాగేసుకున్న ఆరోపణల్లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు. రెండు క్రితం ఈ కేసులో విజయసాయి రెడ్డిన ఈడీ విచారించింది. ఇప్పుడు ఏపీ సీఐడీ విచారించనుంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంపై ఇప్పటికే కేవీ రావుకంప్లైంట్ చేయటం తెలిసిందే.
తాజాగా విజయసాయిపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై 506,384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి.. ఏపీ సీఐడి విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉండగా.. పోర్టు రాయించుకున్నది విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీగా కూటమి నేతలు ఆరోపించటం తెలిసిందే. ఇప్పటికే విశాఖ బీచ్ విషయంలో విజయసాయిరెడ్డి కుమార్తె మీద కేసు నమోదైంది. దీనికి తోడు ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అండ్ కో ఉండటం తెలిసిందే. మొత్తంగా వరుస కేసులతో విజయసాయి ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పక తప్పదు.