అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలవడానికి అడ్డంకులు తొలగాయి. టెండర్లు పిలుచుకోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని ఖరారు చేయాలని సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
కానీ అమరావతిపై నిలువెల్లా ద్వేషం నింపుకొన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం దానిపై విషం చిమ్మడం మానలేదు. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. విజయవాడకు ముంపు ముప్పు పొంచి ఉంటే.. దానిని వదిలేసి.. అమరావతి ముంపుబారిన పడకుండా వరద కాలువలు నిర్మించడాన్ని ఆయన విమర్శించారు. తద్వారా ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించారు. ఓపక్క ప్రపంచబ్యాంకు రుణం అందకుండా విశ్వప్రయత్నాలు చేస్తూ.. ఇటు రాజకీయంగానూ రచ్చచేస్తున్నారన్న మాట.
రాజధాని పనులను అడ్డుకునేందుకు కొందరు పనిగట్టుకుని ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవన్నీ జగన్ తన పార్టీ వాళ్ల చేత చేయిస్తున్నవేనని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. మళ్లీ వారంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో వాస్తవ పరిస్థితిని తెలియచేస్తూ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఎన్నికల సంఘానికి ముందుగానే లేఖ రాశారు.
అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.48,012.67 కోట్ల విలువతో చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చిందని.. అందులో రూ.14,874.53 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని అందులో తెలియజేశారు. కోడ్ కారణంగా రాజధాని ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తే తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గత కొన్నేళ్లుగా సుదీర్ఘ జాప్యం జరగడం వల్ల ఇప్పటికే ఖర్చు పెరిగిపోయిందని..ఆర్థిక ఇక్కట్లకూ దారి తీసిందని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో, కేఎఫ్డబ్ల్యూల నుంచి రూ.31 వేల కోట్లు రుణంగా తీసుకున్నామని.. రాజధాని ప్రాజెక్టులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి, , ఆర్థిక వృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలకు సంబంధించినవని గుర్తుచేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపును కొనసాగించడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. బిడి ్డంగ్ ఒప్పందాలను పూర్తి చేయడానికి కూడా అనుమతులు కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) దీనిని పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. టెండర్లు పిలవచ్చు గానీ, వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. కోడ్ ముగిశాకే ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
మళ్లీ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు
రాజధాని అమరావతిపై విద్వేషం, విషం చిమ్మడం కొనసాగుతున్నాయి. అమరావతి అభివృద్ధికి ప్రపంచబ్యాంకు రుణం రాకుండా సైంధవులు కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు. రాజధాని నిర్మాణం తొలి దశకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కలిసి రూ.15,500 కోట్లు రుణమిచ్చేందుకు అంగీకరించాయి. ఇందులో ప్రపంచబ్యాంకు వాటా రూ.6,800 కోట్లు. తొలి వాయిదా నిఽధుల విడుదలకు సర్వం సిద్ధం కావడంతో సీఆర్డీఏ పలు పనులకు టెండర్లు కూడా పిలిచింది.
ఈ దశలో రాజధాని పనులకు రుణం మంజూరుకు సరైన విధానం అవలంబించలేదంటూ తాజాగా ప్రపంచబ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటిపై ఆ బ్యాంకు ఇన్స్పెక్షన్ టీమ్ ప్యానెల్ పరిశీలన ప్రారంభించింది. దీనివల్లే బ్యాలెన్స్ టెండర్లను పిలవడంలో కొంత జాప్యం నడుస్తోంది. దీనికి తోడు శాసనమండలి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో.. టెండర్ల అంశాన్ని సీఆర్డీఏ ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లింది.
కోడ్‌కు ముందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీల బంగళాలు, హ్యాపీనెస్ట్, రోడ్ల అభివృద్ధి పనులు, ఎల్పీఎస్ ఇన్ర్ఫా వంటి పనులకు సీఆర్డీఏ ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచింది. అలాగే అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) కూడా రాజధాని ప్రధాన రోడ్ల నిర్మాణం, అమరావతి వరద విపత్తు ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కొండవీడు వాగు, గ్రావిటీ కెనాల్, పాలవాగు విస్తరణాభివృద్ధి పనులకు టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చింది.
పంపింగ్ స్టేషన్లు, అదనపు రిజర్వాయర్ల నిర్మాణానికీ టెండర్లు పిలిచింది. వీటిలో చాలా పనులకు ఈ నెలలోనే టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈసీ నుంచి వీటికి అభ్యంతరాలు రాకపోవచ్చని ఉన్నతాధికారులు అంటున్నారు.
చంద్రబాబు సీఎం కాగానే..
నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే.. రాజధాని నిర్మాణానికి రుణసమీకరణపై దృష్టి సారించారు. దీంతో జగన్ అనుకూలురు రంగంలోకి దిగారు. రుణం ఇవ్వొద్దని ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు పంపారు. రైతులు స్వచ్ఛందంగా భూములివ్వలేదని.. బలవంతంగా వారి నుంచి లాక్కున్నారని గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేశారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కలిసి వచ్చి అమరావతిలో పర్యటించారు.
ఈ ఫిర్యాదుల్లో నిజానిజాలపై స్వయంగా ఆరాతీశారు. క్షేత్ర స్థాయిలో రైతులను కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత లోతైన పరిశీలన చేసి కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఏడీబీతో కలిసి 15,500 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అయినా మళ్లీ తాజాగా ఫిర్యాదులు వెళ్లాయి. అమరావతి ప్రకృతి విపత్తులకు కేంద్రబిందువని.. ఇటీవల వరదలు ముంచెత్తాయని ఇంకోసారి ఫిర్యాదు చేశారు.
వీటిపైనా ప్రపంచ బ్యాంకు విచారించింది. అమరావతికి శాశ్వత వరద ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఆర్డీఏ కార్యాచరణ ప్రణాళికను వివరించడంతో బ్యాంకు సంతృప్తి వ్యక్తం చేసింది. వరద ప్రణాళికల విషయంలో ప్రపంచ బ్యాంకు కూడా అనేక మార్పులను సూచించడం గమనార్హం. ఇప్పుడేమో.. రుణం మంజూరులో తగిన విధానాన్ని పాటించలేదని ఆ బ్యాంకు దేశీయ బృందంపై ఆరోపణలు మొదలుపెట్టారు. దీంతో ప్రపంచబ్యాంకు ఇన్ స్పెక్షన్ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది.
టెండర్ల పర్యవేక్ష క కమిటీ ఒక్కో టెండర్‌కు ఎన్ని కొర్రీలు వేసింది.. ఎంత పకడ్బందీగా టెండర్ల నిబంధనల రూపకల్పన జరిగింది వంటి వాటిని సాక్ష్యాలతో వివరిస్తుండడంతో తాజా ఆరోపణలు వీగిపోవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి. విద్వేష ఫిర్యాదుల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని.. వారే ఈ పనులు చేయిస్తున్నారని సర్కారు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దానిపై వారికి ద్వేషం పోలేదు.
జగన్ రోతపత్రికలో రాజధానిపై విషం చిమ్మడం పతాకస్థాయికి చేరింది. అమరావతి టెండర్లలో ఘోరాలు, గోల్మాల్ జరిగిపోతున్నాయంటూ అసత్య వార్తలను వండివారుస్తోంది. ఇటీవల రాజధానిలో ప్రధాన రోడ్లు, దాని అనుసంధాన మౌలిక వసతుల పనులకు కలిపి టెండర్లు పిలిస్తే.. భారీగా అంచనాలు పెంచేసి వేర్వేరుగా టెండర్లు పిలిచినట్లు తప్పుడు కథనం రాసింది. ఇలాంటి వార్తలతో ప్రజలను, ప్రపంచ బ్యాంకును తప్పుదారి పట్టించాలన్నది వైసీపీ నేతల వ్యూహంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి నిర్మాణం ముందుకు సాగకుండా చేయడమే వారి దురుద్దేశమని అంటున్నాయి.
గోల్మాల్ ఆరోపణలు
రాజధాని పునిర్నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. దీనికి సంబంధించిన రుణ మంజూరు పత్రాలను హడ్కో అధికారులు.. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబుకు స్వయంగా అందించారు. ఇదే సమయంలో జగన్ పత్రిక అమరావతిపై విషం కక్కడం ఉధృతం చేసింది. అధికారం పోయినా అమరావతి నిర్మాణాన్ని జగన్ సహించలేకపోతున్నారు. తన రోత పత్రిక ద్వారా అమరావతి రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణ పనులకు పిలిచిన టెండర్లలో గోల్మాల్ జరిగిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి అమరావతి రాజధానిలో పిలిచిన 11 రోడ్ల టెండర్లన్నీ ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి తీసుకున్న రుణంతో చేపడుతున్నారు. ఈ పనులకు టెండర్ల ప్రక్రియ నుంచి క్షేత్ర స్థాయిలో పనులు జరిగే వరకు ప్రపంచబ్యాంకు, ఏడీబీల కనుసన్నలలో వాటి పర్యవేక్షణలోనే జరగాలి. జగన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ప్రపంచబ్యాంకు, ఏడీబీలు కూడా ఏడీసీ అధికారులతో కుమ్మక్కు అయితేనే గోల్మాల్ సాధ్యం అవుతుంది. అప్పులు ఇచ్చే సంస్థలు వాటి ద్వారా ప్రయోజనాలు జరగాలని కోరుకుంటాయి.
కానీ వాటి పేరుతో దోచుకుతినడాన్ని ప్రోత్సహిస్తాయా ? ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి ప్రసిద్ధ సంస్థలు ఇలాంటి పనులు చేస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? పైగా ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఆయా రుణ సంస్థలు టెండర్ నిబంధనలను స్వయంగా రూపొందిస్తున్నాయి. స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి. కొంత ఆలస్యమైనా పర్వాలేదని.. ఎక్కడా లోపాలకు తావివ్వకూడదని ప్రభుత్వంతోపాటు ఆ సంస్థలు కూడా భావిస్తున్నాయి.
టెండర్లకు కఠిన షరతులు విధించాయి. సీఆర్డీఏ, ఏడీసీలు రూపొందించిన టెండర్లను చాలా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నాయి. దీనివల్లే టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం రూ.20 వేల కోట్ల మేర మాత్రమే టెండర్లను పిలిచారంటే.. టెండర్ల ప్రక్రియను రుణ సంస్థలు ఎంతగా పరిశీలిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అమరావతిలో చేపట్టే రోడ్లు గతంలోనే చేపట్టినప్పటకీ తీవ్రంగా డ్యామేజీ అయ్యాయి. అమరావతి రాజధానిలో రోడ్లకు అతుకుల బొంతలు వే సే పరిస్థితి ఉండదు.
డ్యామేజీ అయిన ప్రాంతాలలో పూర్తిగా రోడ్లను తొలగించి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. డ్యామేజీ కూడా చాలా ఎక్కువుగా ఉంది. అమరావతిలో ప్రధాన రోడ్ల పునర్నిర్మాణ పనులలో భాగంగా కేవలం ఒక్క రోడ్డు పోర్షన్‌లోనే రూ.30 కోట్ల మేర అంచనాలను పెంచేశారని జగన్ పత్రిక అసత్యం అచ్చువేసింది. ప్రధాన రోడ్ల పునర్నిర్మాణ పనులతో పాటుగా అనేక కాంపోనెంట్ పనులతో కలిపి ఏడీసీ టెండర్లు పిలిచింది.
ఆ కాంపోనెంట్ పనుల్లో వరదనీటి మళ్లింపు కాల్వలు, వాటర్ సప్లై నెట్వర్క్, సీవరేజీ నెట్వర్క్, యుటిలిటీ డక్ట్స్ , రీయూజ్ వాటర్ లైన్స్, పెడస్ర్టియల్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, స్ర్టీట్ ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ గుత్తగా టెండర్లు పిలిస్తే.. జగన్ దీనిని దాచి విమర్శల విషం కక్కుతున్నారు. అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణ పనుల దగ్గర నుంచి ప్రారంభించిన విధ్వంసం ఆ తర్వాత క్రమంగా అన్ని పనులను నిలిపేస్తూ అమరావతిని ఆయన కకావికలం చేశారు. ఆయన నిర్వాకం అమరావతికి తీరని నష్టాన్ని తెచ్చి పెట్టింది.
అప్పటికీ, ఇప్పటికీ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) 25 శాతం మేర పెరిగిపోయాయి. దీనికితోడు జీఎస్టీ కూడా 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. రాజధానిలో రోడ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించిన పనులలో భూగర్భ విద్యుత కేబుల్స్, ఇంటర్నెట్ తదితర కేబుల్స్‌కు సంబంధించి దుర్భేధ్యమైన ఆర్సీ డక్ట్స్ నిర్మించాల్సి ఉంటుంది. స్ర్టామ్ వాటర్ డ్రెయిన్స్, మంచినీటి పైపులైన్ల నెట్వర్క్, అండర్ గ్రౌండ్ డ్రెయినే పనులు సాధారణమైనవి కావు. సెంట్రల్ మీడియం అభివృద్ధి చేయటంతో పాటు కిలోమీటర్ల కొద్దీ సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు వంటి పనులు కూడా చిన్నవి కావు. ఈ పనులన్నింటినీ దాచి పెట్టి రోడ్డు పోర్షన్‌తో ముడిపెట్టి అంచనాలు పెరిగిపోయాయంటూ జగన్ అసత్యాలు వల్లెవేస్తున్నారు.